జగన్ అధికారం ధీమా...ఏమా కధ

వైసీపీ అధినేత ఓటమి తరువాత నుంచి ఒకే మాట అంటున్నారు. ఈసారి ఏదో ఇలా అయింది. వచ్చేసారి మనదే అధికారం అని ఆయన కడు నమ్మకంగా చెబుతూ వస్తున్నారు.;

Update: 2026-04-16 02:30 GMT

వైసీపీ అధినేత ఓటమి తరువాత నుంచి ఒకే మాట అంటున్నారు. ఈసారి ఏదో ఇలా అయింది. వచ్చేసారి మనదే అధికారం అని ఆయన కడు నమ్మకంగా చెబుతూ వస్తున్నారు. మరో వైపు చూస్తే జగన్ పార్టీ వేదికల మీద అయినా బయట మీటింగులలో అయినా లేదా మీడియా సమావేశాల్లో అయినా ఒక మాట పదే పదే చెబుతున్నారు. అదేంటి అంటే కళ్ళు మూసి తెరచే లోపు అధికారం టీడీపీ కూటమి నుంచి వైసీపీ వడిలోకి వచ్చి పడుతుంది అని. అది ప్రజలకు చెబుతున్నారు, పార్టీ వారికీ చెబుతున్నారు. కేవలం కేలండర్ లో ఇయర్స్ మార్పు మాత్రమే ఆలస్యం, కాలం తన వేగం పెంచుకుంటే చాలు మళ్ళీ సీఎం చెయిర్ తననే వరిస్తుందని తానే సింహాసనం అధిష్టిస్తానని జగన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

ట్రాక్ రికార్డుతో :

ఫస్ట్ జగన్ ఆలోచించేది ఏపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు. ఇక్కడ ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని తరువాత ఎన్నికల్లో జనాలు ఓడిస్తున్నారు. విపక్షంలో ఉన్న పార్టీని తెచ్చి అందలం ఎక్కిస్తున్నారు. ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ ఇదే జరుగుతోంది. దానికి కారణం ప్రజలలో ఆశలు ఆరాటాలు ఎక్కువగా ఉండడం ఒక్కటైతే రెండవది ఆప్షలు ఉంటే వాటిని వాడుకోవాలన్న ఆలోచనలు ఉండడం. బలంగా అధికార విపక్షాలు ఉన్న చోట అధికార మార్పిడి ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాలలోనూ జరుగుతోంది. అదే జగన్ లో ధీమా పెంచుతోంది.

కూటమి మీద వ్యతిరేకత :

మూడు పార్టీలు కలసి అధికారంలోకి వచ్చినా కూడా ఈసారి ఆ పార్టీలను జనాలు ఓడిస్తారని జగన్ భావిస్తున్నారు. దానికి కారణం అధికారంలో ఉన్న పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ భారీగా ఉంటుంది. పైగా ఎంత హెచ్చు మెజారిటీతో సీట్లు అప్పగిస్తే అంతకు అంత ఆ ఆశలు పెరిగిపోతాయి. 164 సీట్లతో కూటమికి అధికారం కట్టబెట్టిన ప్రజల ఆశలు ఆకాశాన్ని అంటితే కూటమి రెండేళ్ల పాలన ఆ తీరున సాగడం లేదని వైసీపీ అధినాయకత్వం గట్టిగా భావిస్తోంది. దాంతో పాటు సూపర్ సిక్స్ హామీలు సరిగ్గా చేయడం లేదని తమ హయాంలో పధకాలతో పోల్చుకుని జనాలు ఇపుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది కూడా జగన్ భావనగా ఉంది అని అంటున్నారు.

గ్రామీణ ఆంధ్రా :

ఇక ఏపీలో చూస్తే పట్టణాలు తక్కువ పల్లెలు ఎక్కువ. పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అలా రూరల్ సెక్టార్ లో 130 దాకా అసెంబ్లీ సీట్లు ఉంటే 45 సీట్లు పట్టణ ప్రంతాలలో ఉంటున్నాయి. అధికార మార్పిడి ఎపుడూ పల్లెలే డిసైడ్ చేస్తున్నాయి. పల్లెలలో జనాలు చాలా తొందరగా ఆదరిస్తారు, తమకు ఇబ్బంది ఏ మాత్రం జరిగినా అంతే తొందరగా వ్యతిరేకం అవుతారు. అంతే కాదు ఒకసారి ఒకరికి చాన్స్ ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వాలనుకుంటారు. దీర్ఘకాలం ఒక్కరి వైపే ఉండే విధానానికి పల్లె ఓటర్లు కొంత భిన్నంగా ఉంటారు. పట్టణాలలో అయితే అభివృద్ధికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒకే పాలనకు ఒకే ప్రభుత్వానికి ఎక్కువ చాన్సులు ఇవ్వాలని ఉంటుంది. ఇలా రూరల్ సెక్టార్ లో ఉన్న ఒపీనియన్ మీదనే వైసీపీ ఎక్కువగా ఆశలను పెంచుకుంటోంది అని అంటున్నారు.

పాదయాత్రతో సీన్ చేంజ్ :

ఇక జగన్ వద్ద ఉన్న ఆఖరు అస్త్రం పాదయాత్ర. ఇది ఒక విధంగా బ్రహ్మాస్త్రంగా వైసీపీ చెబుతోంది. జగన్ కి విశేషమైన ప్రజాదరణ ఉందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. జగన్ ఒక్కసారి జనంలోకి రావాలి కానీ ఏపీ పొలిటికల్ సీన్ మొత్తం చేంజ్ అవుతుందని కూడా భావిస్తోంది. 2027 జూలై నుంచి జగన్ మొదలు పెట్టబోయే పాదయాత్ర 2029 ఎన్నికల దాకా సాగుతుంది అని అంటున్నారు. దాంతో ఏపీలో కూటమిని దించేసి తాము అధికారంలోకి వస్తామన్న బలమైన సంకేతాన్ని ఈ పాదయాత్ర ఇస్తుందని ఇది గేం చేంజర్ అవుతుందని వైసీపీ భావిస్తోంది. ఈ విధంగా అనీక రకాలైన సమీకరణలతోనే జగన్ 2029లో అధికారం అని లెక్కలేస్తున్నారు. మరి జగన్ అంచనాలు ఆశలు లెక్కలు ఎత్తులు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News