బుల్డోజర్ వర్సెస్ వారసత్వం.. యూపీలో ‘పద్మశ్రీ’ ఇంటి కూల్చివేతపై దుమారం..
బుల్డోజర్ బాబాగా గుర్తింపు సంపాదించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని బాధితులు కూడా సమర్థిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.;
బుల్డోజర్ బాబాగా గుర్తింపు సంపాదించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని బాధితులు కూడా సమర్థిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తాను అభివృద్దికి అండగా ఉంటానని, రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలుపుతానని ఎప్పుడో చెప్పారు. ఆ దిశగానే పనులు చేస్తున్నారు. అయితే ఇటీవల వారణాసి నగరంలో మాజీ ఒలింపియన్, హాకీ ఆటగాడు మహమ్మద్ షాహీద్ నివాసంలోని కొంత భాగం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తలకెత్తుకున్నాయి. యోగి పాలనపై తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
స్వర్ణ పతకం తెచ్చిన షాదీద్ రాయ్..
మహమ్మద్ షాహీద్ 1980 ఒలింపిక్స్‌లో భారత జట్టు తరుఫున ఆడి స్వర్ణపతకం తీసుకువచ్చాడు. 2016లో ఆయన మృతి చెందారు. షాహిద్ పూర్వీకుల ఇల్లు వారణాసి నగరంలోని కచేరీ-సంధహా మార్గంలో ఉంది. అయితే యోగి ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరించాలని పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రోడ్డు విస్తరణ పనుల్లో ఇంటి కొంత భాగాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ చర్యపై రాజకీయంగా మాటల యుద్ధాలు మొదలయ్యాయి.
యోగిపై ప్రతిపక్షాల ఫైర్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘పద్మశ్రీ మహమ్మద్ షాహిద్ రాయ్ ఇంటిని బీజేపీ ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తికి చెందిన ఇల్లు మాత్రమే కాదు.. భారతదేశ క్రీడా వారసత్వానికి గుర్తుగా నిలిచిన స్థలం అని, కాశీ నగరంలోని ప్రముఖులను అవమానించే ఈ చర్యను ప్రజలు క్షమించరు.’ అని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.
ఇక సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘బుల్డోజర్ యంత్రాల ద్వారా మానవత్వం, దేశ వీరుల కృషి, గౌరవాన్ని నేలమట్టం చేయడం విచారకరం’ అని పేర్కొన్నారు. క్రీడా వారసత్వాన్ని, సామాజిక గుర్తింపును భర్తీ చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
తమకేం అభ్యంతరం లేదన్న షహీద్ భార్య..
ప్రతిపక్షాల మాటల యుద్ధాలు ఇలా ఉంటే.. షాహిద్ భార్య పర్వీన్ షాహిద్ దీనిపై స్పందించారు. ‘ఈ కూల్చివేతకు సంబంధించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మాకు అన్ని విధాలుగా నష్ట పరిహారం అందింది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సరిపోతుందని మేము భావిస్తు్నాం.’ అని ఆమె అన్నారు. షాహీద్ కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ అభివృద్ధి విధానాలను అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది.
యూపీలో రాజకీయ దుమారం..
ఈ ఘటన తర్వాత సామాజిక, రాజకీయ, క్రీడా వర్గాల నుంచి వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఇది కేవలం వారణాసి రోడ్డు విస్తరణ అంశమే కాకుండా, క్రీడా వారసత్వం, ప్రజల గౌరవం, రాజకీయ బాధ్యత వంటి విషయాలను మళ్లీ చర్చకు తెచ్చింది.