యోగీ వర్సెస్ అఖిలేష్ ... అయోధ్యలో తేల్చుకుందామా ?
అయోధ్య అనగానే భక్తి భావన కలుగుతుంది. శ్రీరాముడి జన్మస్థలంగా దానికి పేరు. రాముడు అక్కడ వెలసిన చోటు అని అంతా ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తారు.
అయోధ్య అనగానే భక్తి భావన కలుగుతుంది. శ్రీరాముడి జన్మస్థలంగా దానికి పేరు. రాముడు అక్కడ వెలసిన చోటు అని అంతా ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తారు. అలాంటి అయోధ్యలో ఇపుడు రాజకీయ వేడి రాజేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. అయోధ్యలో తేల్చుకుందామా అని ఒకరు అంటే సై అని మరొకరు అంటున్నారు. దీంతో 2027 లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరూ అయోధ్య వేదికగా ముఖా ముఖీ తలపడేందుకు సిద్ధపడుతున్నారు.
అయోధ్యలో బలమెంత :
ఇదిలా ఉంటే అయోధ్యలో బలం బీజేపీకే ఉంది. వరుసగా రెండు సార్లు ఆ పార్టీ అక్కడ నుంచి గెలిచింది. 2017, 2022 లలో బీజేపీకి చెందిన వేద్ ప్రకాష్ గుప్తా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇంకా చెప్పాలీ అంటే అయోధ్యలో గత యాభై ఏళ్లలో బీజేపీ అత్యధిక సార్లు గెలిస్తే మిగిలిన పార్టీలు అన్నీ ఒకటి రెండు సార్లు మాత్రమే విజయం అందుకున్నాయి. గడచిన ముప్పయి అయిదేళ్ళలో చూస్తే ఒక్కసారి మాత్రమే సమాజ్ వాది పార్టీ గెలిస్తే మిగిలిన అన్ని సార్లూ బీజేపీ అయోధ్యలో గెలిచింది. అందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి తాను పోటీకి రెడీ అని అంటున్నారు.
సవాల్ చేసిన అఖిలేష్ :
ఇంతకీ యోగి అయోధ్య నుంచి పోటీకి ఎందుకు సిద్ధపడ్డారు అంటే మాజీ సీఎం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సవాల్ కి జవాబుగా అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేష్ సీఎం యోగికి సవాల్ విసిరారు. దానికి కారణం ఉంది. అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ లో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దాని విషయంలో అయితే విపక్షాలకు ఒక ఆయుధం దొరికింది. ఈ నేపధ్యంలోనే అఖిలేష్ యోగికి సవాల్ చేశారు. అక్కడ పోటీకి దిగితే బీజేపీ సంగతి జనాలు చూస్తారు అన్నదే ఎస్పీ ఆలోచనగా ఉంది.
మళ్ళీ బీజేపీదే :
దానికి యోగి ఒక్క ముక్కలో జవాబు చెప్పలేదు, తాను అయోధ్యలో పోటీకి దిగుతాను అని అంటూనే మరోసారి యూపీలో బీజేపీ గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. నూటికి ఎనభై సీట్లు బీజేపీకే వస్తాయని అన్నారు. సమాజ్ వాదీ పార్టీని ఒక కుటుంబ పార్టీగా ఆయన అభివర్ణించారు. రాజ్యసభ ఎన్నికల్లో తన సొంత బాబాయ్ కి సీటు ఇచ్చిన ఘనత ఎస్పీది అని యోగీ సెటైర్లు వేశారు. బడుగులు దళితులు ఇతర వర్గాలకు టికెట్లు ఇవ్వాలని ఎస్పీకి అనిపించలేదా అని ప్రశ్నించారు. ఎస్పీ ఏర్పాటు చేసిన కూటమి యూపీని ముంచేదిగా ఉందని కూడా యోగీ మండిపడ్డారు.
గెలుపు ధీమాతోనే :
అయితే రెండు సార్లు బీజేపీకి చాన్స్ ఇచ్చిన యూపీ జనాలు ఈసారి మార్పు కోరు కుంటున్నారని సమాజ్ వాదీ పార్టీ అభిప్రాయ పడుతోంది. అందుకే అయోధ్య నుంచి యోగీ పోటీ చేసినా తాను కాదు ఒక యువ నేతను ముందు పెట్టి ఓడించగలమని అంటున్నారు. ఈసారి గెలిచేది ఎస్పీనే అని అఖిలేష్ నిబ్బరంగా ఉంటూ యోగీకి సవాల్ విసిరారు. దానికి ప్రతిగా యోగీ కూడా మీకు దక్కేది ఇరవై శాతం సీట్లే అని కౌంటర్ ఎటాక్ చేశారు. మొత్తానికి దేశ రాజకీయ గతిని మార్చేసే సత్తా ఉన్న యూపీలో ఆరు నెలల ముందే ఎన్నికల వేడి రాజుకుంది. అది కూడా రాముడి జన్మస్థలం వేదికగా సవాళ్ల పర్వానికి శ్రీకారం చుట్టింది. ఇంతకీ యోగీ అఖిలేష్ ప్రత్యక్షంగా పోటీకి దిగుతారా అంటే అది అయ్యేది కాదనే అంటున్నారు.