బీజేపీకి ముందు నుయ్యి...వెనక గొయ్యి !

అదేంటో రాజకీయం అలాగే ఉంటుందేమో. మహా సముద్రాలను ఈదిన వాడు పిల్ల కాలువలో పడి కొట్టుకుపోయాడు అని ఒక ముతక సామెత ఉంది.

Update: 2026-10-11 01:44 GMT

అదేంటో రాజకీయం అలాగే ఉంటుందేమో. మహా సముద్రాలను ఈదిన వాడు పిల్ల కాలువలో పడి కొట్టుకుపోయాడు అని ఒక ముతక సామెత ఉంది. దేశం మొత్తాన్ని బీజేపీ జయించేస్తోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీకి తరగని ఆదరణ దక్కుతోంది. భారత్ మాట ఈ రోజు ప్రపంచం వింటోంది అన్న భావనను అయితే బీజేపీ కల్పించింది. కానీ ఇంట్లో ఈగల మోత మాత్రం తప్పడం లేదని సెటైర్లు వచ్చి పడుతున్నాయి. బీజేపీకి ఒక్కో ఉద్యమం ఒక్కో అనుభవంగా ఉంటోంది. పార్లమెంట్ లో మెజారిటీ బాగానే ఉంది. అక్కడ నిర్ణయాలకు ఎదురు లేదు, సభలో అంతా తాము చెప్పినట్లుగా సాగుతోంది. కానీ విపక్షాల వీధి పోరాటాలు మాత్రం బీజేపీని గుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి అంటున్నారు.

సాగు చట్టాలతో :

ఇక 2022లో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. సాగు నీటి చట్టాలను మూడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసింది. అయితే వాటిని రద్దు చేసి తీరాల్సిందే అని రైతులు అంతా ఆందోళన రోజుల తరబడి చేశారు. ఢిల్లీలోనూ సరిహద్దులలోనూ సాగిన ఈ అతి పెద్ద ఉద్యమం బీజేపీని తొలిసారి కదిలించింది. వరసగా పార్లమెంట్ సమావేశాలు అన్నీ ఈ ఆందోళనల మధ్య కరిగిపోయిన నేపధ్యంలో బీజేపీ చివరికి సాగు చట్టాలను ఉప సం హరించుకుంది. అలా ఆ ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. అయితే అది దేశవ్యాప్త ఉద్యమంగా రూపు దాల్చలేదు.

జంతర్ మంతర్ మహిమతో :

కానీ ఈ ఏడాది మాత్రం సీజేపీ అన్న సోషల్ మీడియాలో పుట్టి జెన్ జీ యూత్ సపోర్టు తో గ్రౌండ్ లోకి దిగి ఫౌండేషన్ లేకుండానే రోజుల తరబడి జంతర్ మంతర్ వద్ద చేసిన వినూత్న తరహా ఉద్యమానికి కేంద్రం ఏకంగా తగ్గాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతటి ప్రముఖ నాయకుడు రాజీనామా సమర్పించి వెను తిరగాల్సి వచ్చింది. అంటే బీజేపీకి జెన్ జీ సవాల్ ని ఏ రేంజిలో చూపించిన ఉద్యమం సీజేపీ చేపట్టిందో అర్ధం అవుతుంది. మొత్తానికి కేంద్ర మంత్రి రాజీనామాతో అంతా సర్దుకుందని ఇక జెన్ జీ తో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుని ముందుకు సాగవచ్చు అని బీజేపీ వ్యూహకర్తలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా మరో ఇష్యూతో సీజేపీ చలో జంతర్ మంతర్ అంటూ దూసుకొచ్చింది.

జ్ఞానేశ్ రాజీనామా కోసం :

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి అంటూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద ఉద్యమించేందుకు రెడీ అయింది. అయితే అక్టోబర్ 10న జరిగే ఈ ఉద్యమాన్ని పోలీసుల బలగంతో చాలా వరకూ కేంద్రం విజయవంతంగా అడ్డుకోగలిగింది. అయితే తాము ఇంకా తగ్గేది లేదని ఈ రోజు కాకపోతే మరో రోజు ఉద్యమిస్తామని సీజేపీ నేతలు చెబుతున్నారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని ఉద్యమానికి ముహూర్తాలు ఉండవని కూడా అంటున్నారు. ఇక్కడే బీజేపీ పెద్దలకు ఏమి చేయాలో అర్ధం కాలేదు, ఒకసారి కాబట్టి ఇంటర్నెట్ రవాణా వంటి సదుపాయాలని నియంత్రించి మరీ సీజేపీ దూకుడుకు బ్రేకులు వేయగలిగింది. వాళ్ళు మళ్లీ మళ్లీ వస్తే జంతర్ మంతర్ వద్దకు ఒక్కసారిగా చేరితే అపుడు అక్కడ తిష్ట వేసిన వారిని కదపడం కష్టం అన్నది జూలైలో జరిగిన ఉద్యమం నిరూపించింది కూడా. అందుకే బీజేపీ పెద్దలకు ఇపుడు ఏమీ పాలు పోవడం లేదని అంటున్నారు.

నాడు ఓకే అన్నది రైటేనా :

ఈ మాట ఇపుడు బీజేపీ పెద్దలకు గుర్తుకు వస్తోంది. కేంద్ర మంత్రిని ఆనాడు రాజీనామా చేయించడం వ్యూహాత్మకమైన తప్పు అని ఇపుడు గ్రహిస్తున్నారని అంటున్నారు. ఆనాడే గట్టిగా నిలబడి ఉంటే ఈ రోజున సీఈసీ రాజీనామా అంటూ సీజేపీ జనం ముందుకు జంతర్ మంతర్ వద్దకూ వచ్చేది కాదని అంటున్నారు. ఒక రాజీనామా చేయించామని రెండవది మూడవది అని డిమాండ్లు పెడుతూ వస్తూంటే బీజేపీ పెద్దలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతం అవుతున్నారని అంటున్నారు. ఈసారి కూడా తగ్గితే మాత్రం ఇక మోడీ రాజీనామాకే ముచ్చటగా మూడవసారి జంతర్ మంతర్ అంటారని కూడా అనుమానిస్తున్నారు. అయితే గట్టిగా నిలబడితే ఈ ఉద్యమాలను ఎలా నియంత్రించడమో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందని అంటున్నారు. వారూ వీరు అని కాకుండా చాలా వర్గాలు వస్తున్నాయి. వ్యక్తులు సమూహంగా వచ్చి ఉద్యమిస్తున్న నేపధ్యం ఉంది. దీంతో ఈ తరహా ఉద్యమాలను కంట్రోల్ చేయడం కష్టమే అంటున్నారు. దీంతో బీజేపీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News