వైసీపీ మీదనే బెట్టింగ్ జరుగుతుందా?
ఈ నేపథ్యంలో... ఏపీలో తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారా.. లేదా.. అనే అంశంపైనే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ లో కూడా ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు.;
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక పోలింగ్ తేదీకి మధ్యలో పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. ఈ సమయంలో బెట్టింగ్ యాప్స్ ఎంట్రీ ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.
అవును... కాదేదీ బెట్టింగుకు అనర్హం అనే చర్చ ఇటీవల మరీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. పైగా... ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో బంతి బంతికీ బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ఫలితాలపైనా బెట్టింగ్ జోరుగా మొదలైందని అంటున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నేతల గెలుపోటములతో పాటు.. మెజారిటీపైనా బలంగా బెట్టింగ్ జరుగుతుందని చెబుతున్నారు.
ఈ విషయంలో గ్రామాలు, మెట్రోపాలిటన్ నగరాలు అనే తారతమ్యాలేవీ లేవని.. ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో వారు బెట్టింగు యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఆఫర్లు, ఆప్షన్లూ పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో బ్భాగంగా... ఏపీలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ మీదనే ప్రధానంగా బెట్టింగ్ జరుగుతుందని అంటున్నారు.
వాస్తవానికి ఈ ఎన్నికలు జగన్ పాలన కావాలా - వద్దా అనే అంశంపైనే జరుగుతున్నాయని అంటు అధికార పార్టీ నేతలతో పాటు, ఇటు ప్రతిపక్ష నేతలూ చెబుతున్న పరిస్థితి! పేదలకు, సామాన్యులు జగన్ పాలనే కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతుంటే... జగన్ రహిత ఏపీ లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు కూటమి నేతలు చెబుతున్న పరిస్థితి!
ఈ నేపథ్యంలో... ఏపీలో తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారా.. లేదా.. అనే అంశంపైనే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ లో కూడా ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేదా అనేదే ప్రధానంగా మారిందని.. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఎన్నికలు పూర్తిగా "జగన్ గెలుపు - జగన్ ఓటమి" పైనే జరుగుతున్నాయని చెబుతున్నారు!
ఇదే చర్చ ప్రజల్లోనూ, రాజకీయాల్లోనూ జరుగుతున్న నేపథ్యంలో... ఇలా బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి గెలుస్తుందా లేదా అనే విషయంపై బెట్టింగ్ ఆప్షన్స్ దర్శనమివ్వడం లేదని చెబుతున్నారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది!