ఎవరి ముహూర్తాలు వారే పెట్టేసుకుంటున్నారు !

ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతూంటే మేము గ్యారంటీగా రావడం ఖాయమని టీడీపీ కూటమి అంటోంది.

Update: 2024-05-23 14:30 GMT

ఏపీలో కౌంటింగ్ కి ఇంకా చూస్తే గట్టిగా పది రోజుల సమయం ఉంది. అయినా సరే అటూ ఇటూ కూడా ఎవరూ ఓపలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతూంటే మేము గ్యారంటీగా రావడం ఖాయమని టీడీపీ కూటమి అంటోంది.

ఇక సర్వేలు చూస్తే రెండు వైపులా వస్తున్నాయి. అవి కూడా ఎవరికి వారుగా చేయించుకుంటున్నవి అని అంటున్నారు. ఇందులో ప్రామాణికత ఎంత అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఓటేసిన జనాలు చూస్తే వారు గుంభనంగా ఉన్నారు. ఎవరు ఏమి అడిగినా జనాల నుంచి జవాబు లేదు. దాంతో ఏవో కొండ గుర్తులు బట్టి గతంలో ఇలా జరిగింది కాబట్టి అని అంచనా వేసుకుని చేసుకుంటున్న సర్వేలు తప్ప అసలు విషయం అయితే ఈవీఎంలలో గుట్టుగానే ఉంది.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఈసారి మరో కొత్త ట్రెండ్ కూడా కనిపిస్తోంది. అదేంటి అంటే ముహూర్తాలు. ప్రమాణ స్వీకారానికి ఫలానా డేట్ అంటూ టైం కూడా పక్కన రాసేస్తున్నారు. ఇక ఏపీలో అయితే ఒక డేట్ మాత్రం పక్కాగా సీఎం ప్రమాణ స్వీకారానికి కనిపిస్తోంది. అదే జూన్ 9. ఈ డేట్ కి ఉన్న వాల్యూ ఏంటి అంటే తదియ తిధిగా కనిపిస్తోంది. మాసం చూస్తే జేష్ట మాసంగా ఉంది.

సాధారణంగా చూస్తే పెళ్ళిళ్ళు వేడుకలకు శుభ ముహూర్తాలు అయితే ఇప్పట్లో లేవు. కానీ ప్రమాణ స్వీకారాలకు మాత్రం ఇలాంటి ముహూర్తాలు బాగానే ఉంటాయి. మంచి రోజులుగా కూడా వీటినే చెబుతారు. అందుకే ఈసారి ఈ డేట్ మీదనే అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ కన్నేసి ఉంచాయని అంటున్నారు.

Read more!

ఇక జూన్ 9 ఆదివారం. దాంతో కూడా ఈ డేట్ ని ఎంచుకున్నారు. అలాగే కౌంటింగ్ కి ముహూర్తానికి మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఉంది. ఈ లోగా మంత్రుల ఎంపిక ఇత్యాది విషయాలను కూడా చూసుకుని అన్నీ సర్దుబాటు చేసుకుంటారు. మొత్తానికి జూన్ 9 డేట్ టైం ఫిక్స్ చేసుకున్నారు. అలా ఎవరికి వారుగా పండితుల వద్దకు వెళ్ళి ముహూర్తాలు సైతం సిద్ధం చేసుకున్నారు.

ఇక పొరుగున ఒడిషాలో అయితే అక్కడ సీఎం బిజూ పట్నాయక్ సీఎం గా ప్రమాణం గురించి వారు ముందే రెడీ ప్రకటించారు. జూన్ మొదటి వారంలో అని వారు చెప్పారు. బీజేపీ కూడా అక్కడ గెలుస్తామని అంటోంది. ఇక దేశాంలో చూస్తే ఎన్డీయే కూటమి గెలిస్తే ఏ తేదీన ప్రమాణం చేస్తారు అన్నది ఇంకా డేట్ ఏదీ ఫిక్స్ చేయలేదు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధానిని ముందు ఎన్నుకుని ఆ తరువాత ప్రమాణం డేట్ ఫిక్స్ చేసుకుంటారు.

ఇలా చూస్తే రాజకీయంగా ఏపీయే ఈ విషయంలో ముందు ఉందని చెప్పాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. మరి ఏపీ ప్రజలు ఎవరిని ఆదరించి పట్టం కడతారు అన్న దాని మీదనే అందరి ఆసక్తి ఉంది. ఈసారి ఎన్నికలు కూడా హోరా హోరీగా జరిగాయి. మళ్లీ ఇలాంటి ఎన్నికలను కూడా ఎవరూ చూసి ఉండరు అనే అంటున్నారు. 2029 నాటికి ఎన్నికలు ఇంతకు ఇంత హీటెక్కించి జరుగుతాయని కూడా ఎవరూ అనుకోవడం లేదు. సో 2024 మాత్రం ఏపీ పొలిటికల్ హిస్టరీలో ఒక స్పెషల్ పేజ్ గా కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఎవరి జాతకాలు ఎవరి ముహూర్తాలు ఎవరి నమ్మకాలు నిజం అవుతాయో అన్నది జూన్ 4 పక్కాగా తేల్చేస్తుంది.

Tags:    

Similar News