అధికారాంతమున వైసీపీ సలహాదారులెక్కడ ?

అంటే పవర్ లో ఉంటే ఏమీ కనబడదు, అంతా మనవారే, అందరూ మనతోనే అన్నట్లుగా ఉంటుంది.;

Update: 2025-05-15 11:30 GMT
అధికారాంతమున వైసీపీ సలహాదారులెక్కడ ?

అధికారాంతమున చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్‌ అని ఒక పద్యం ఉంది. అంటే పవర్ లో ఉంటే ఏమీ కనబడదు, అంతా మనవారే, అందరూ మనతోనే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆధికారం అంతమయినపుడే చూడాలి పెద్దల సౌభాగ్యాలు అని అంటారు. ఎవరూ పలకరు. ఉలకరు. అసలు ఆ వైపు రారు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే తప్పించుకుని తిరుగుతారు.

వైసీపీలో చాలా మంది వ్యవహారాలు కూడా అలాగే ఉన్నాయి అని అంటున్నారు. జగన్ సీఎం గా ఉండగా అనేక మందికి ప్రభుత్వం తరఫున పోషించారు. వారికి ఉన్నత పదవులు ఇచ్చారు. తనకు నచ్చారు అంటే చాలు మెచ్చి మెడలో వీరతాడు వేసేవారు. ఆ విధంగా చాలా మంది అర్హులైపోయి అందలాలు ఎక్కేసారు. ఇక మరోటి చెప్పుకుంటే టోటల్ వైసీపీ జమానాలో జంబోజెట్ మాదిరిగా సలహాదారులు ఉండేవారు.

దాదాపుగా వందకు తక్కువ లేకుండా ఈ పదవులు ఉండేవి. ఒక్కొక్కరికి మూడు లక్షలకు తక్కువ కాకుండా సర్కారీ భత్యాలు గౌరవాలు ప్రోటోకాల్స్ అన్నీ సమకూరేవి. ఇలా అయిదేళ్ళ పాటు అన్ని రకాలైన అధికార వైభోగాలు అనుభవించిన ఈ సలహాదారులు వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి కాగానే గప్ చుప్ అయ్యారు అని అంటున్నారు.

వారిలో చాలా మంది ఎక్కడ ఉన్నారో తెలియదుట. వారిని ఏరి కోరి వైసీపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలనుకుంది. మరి ప్రభుత్వం ఎంతమేరకు వారి సేవలను ఉపయోగించుకుందో తెలియదు కానీ ఇపుడు పార్టీకి వారి సేవలు చాలా అత్యవసరం అని అంటున్నారు.

పార్టీ పరిస్థితి చూస్తే ఏడాది గడుస్తున్నా ఇంకా భారీ ఓటమి నుంచి కోలుకోవడం లేదు. జనం వద్దకు ఎలా వెళ్ళాలో మార్గం తెలియడం లేదు. పార్టీ లీడర్లలో ఎలా చురుకుదనం పుట్టించాలో అర్ధం కావడం లేదు. ఈ రకమైన నేపధ్యంలో హఠాత్తుగా పార్టీ పెద్దలకు సలహాదారులు మనకు చాలా మంది వెనకటిలో ఉండేవారు కదా అని గుర్తుకు వచ్చిందంట. అలా గుర్తుకు వచ్చిన వెంటనే వారికి ఫోన్లు కలపమన్నారుట.

అయితే ఫోన్లు కలిపినా అటు నుంచి మాత్రం నో ఆన్సర్ అని వస్తోందిట. అంతే కాదు ఫోన్ స్విచాఫ్ అవుతోందిట. చాలా మంది అసలు అందుబాటులో లేరని చెబుతున్నారు. వైసీపీ అధినాయకత్వం చూస్తే జిల్లాల వారీగా సామాజిక సమీకరణలను సైతం లెక్క వేసుకుని వివిధ రంగాలలో సలహాదారులను నియమించింది.

ఇపుడు వారి అవసరం ఉందని భావించి ఆయా జిల్లాలకు కబురు చేసినా వారు అక్కడ లేరని జవాబు వస్తోందిట. సలహాదారుల అవసరం ఉంది ఇపుడు అని పార్టీ కోరుకుంటున్నా వారంతా ఏనాడో సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. చాలా ఆలస్యంగా అధినాయకత్వం మేలుకుని వారి గురించి ఫోన్ ద్వారా ఆరా తీసేసరికి అంతా ఎవరికి వారుగా సర్దుకున్నారని అంటున్నారు.

నిజానికి పార్టీకి పనిచేసేవారు ఎవరో పదవుల కోసం వెంపర్లాడేవారు ఎవరో చూసుకుని మరీ వారిని పోస్టులు ఇచ్చి ఉంటే ఈ రోజున అందులో కొందరైనా ఠంచనుగా పార్టీ ఆఫీసు వద్ద కనిపించేవారు కదా అంటున్నారు. అలా కాకుండా తాము మెచ్చమాని తెచ్చి అందలం ఎక్కించిన పుణ్యానికి ఈ రోజున వారు ఎవరూ లేకుండా పోయారని అంటున్నారు. ఈ విషయాలతో అయినా అధినాయక్త్వానికి పనిచేసే వారు ఎవరో పదవుల కోసం వగచే వారు ఎవరో తేడా తెలిస్తే చాలు అన్న మాట పార్టీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News