బిగ్ అప్ డేట్... వైసీపీలో యనమల ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

ఇందులో భాగంగా తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ వైసీపీకి జై కొడుతుందని తెలుస్తుంది!

Update: 2024-04-25 12:12 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో.. ఇక ప్రచార కార్యక్రమాలు, వ్యూహాలు, ఆపరేషన్ ఆకర్షలపై పార్టీలు దృష్టిపెట్టాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ వైసీపీకి జై కొడుతుందని తెలుస్తుంది!

అవును... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన వైసీపీ అందుకు అనుగుణంగా మరిన్ని వ్యూహాలు రచిస్తుందని తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా, యనమల రామకృష్ణుడు కుటుంబానికీ మధ్య ఎప్పటి నుంచో వార్ కొనసాగుతోంది! ఇదే సమయంలో... యనమల కుటుంబంలో విభేదాలూ గట్టిగానే ఉన్నాయని చెబుతారు!

ఈ సమయంలో యనమల కుటుంబంలో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయనే కామెంట్లు తుని నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి! టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు... తన తమ్ముడు కృష్ణుడికి బదులుగా తన కుమార్తె దివ్యకు పార్టీ టిక్కెట్ ఇప్పించారు! తుని నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్దిగా బరిలోకి దించుతోన్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన దివ్యకు సహకరించకుండా దూరంగా ఉండిపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన.. స్థానిక వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపారని.. బేషరతుగానే పార్టీలో చేరాలని ఫిక్సయ్యారని.. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 27న వైసీపీలో చేరే అవకాశముందని కథనాలొస్తున్నాయి.

Tags:    

Similar News