రాజ్ భవన్ ఆయనకు బహు దూరమా ?

రాజ్ భవన్ లో గవర్నర్ ఉంటారు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్నింటికీ రాజ్ భవన్ ఉంది.;

Update: 2025-07-31 03:00 GMT

రాజ్ భవన్ లో గవర్నర్ ఉంటారు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్నింటికీ రాజ్ భవన్ ఉంది. అందులో రాజ్య పాల్ ఉంటారు. ఆ పదవిని అందుకుంటే అత్యంత గౌరవం. రాజకీయాలను దాటి రాజ్యాంగ పరిరక్షకుడిగా పదవిని అందుకోవడం అంటే సగటు రాజకీయ నాయకులకు జీవిత కాలంలో సాధించే అతి పెద్ద పొలిటికల్ ఎచీవ్మెంట్ గా చెప్పాలి. అలా చూస్తే కనుక ఈ కీలక పదవిని ఏపీలో పూసపాటి సంస్థానాధీశుడు కేంద్రంలో మంత్రిగా నాలుగేళ్ళ పాటు రాష్ట్రంలో దశాబ్దాల పాటు పనిచేసిన అశోక్ గజపతిరాజు అందుకున్నారు.

ఆ సీనియర్ సంగతేంటి :

ఇక దాదాపుగా 43 ఏళ్ళ పాటు టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని పెంచుకుని ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు కానీ విపక్షంలో ఉన్నపుడు కానీ పదవులు అందుకున్న వారుగా తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు కనిపిస్తారు. ఆయన కూడా గవర్నర్ పదవిని ఆశించారు. అయితే అది కాస్తా విజయనగరం కోట వైపుగా సాగిపోయింది. దాంతో ఈ సీనియర్ సంగతి ఏమిటి అన్నది పార్టీలో చర్చ సాగుతోంది.

అసంతృప్తిగా పెద్దాయన :

యనమల రామక్రిష్ణుడు తనకు గవర్నర్ పదవి దక్కక పోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. తాను ఏమి తక్కువ అని ఆయన సన్నిహితుల వద్ద మధన పడుతున్నారని అంటున్నారు. తాను పార్టీకి సుదీర్ఘ కాలం పాటు ఎంతో సేవ చేశాను అని గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ క్లిష్ట కాలంలో సైతం తాను పెద్దలకు అండగా నిలిచాను అని కూడా అంటున్నారుట. తాను ఎంతో ఆశ పెట్టుకున్న పదవి విషయంలో నిరాశ ఎదురుకావడం పట్ల ఆయన తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

ఇప్పట్లో నో చాన్స్ :

ఇక ఏపీలో టీడీపీ కోటా నుంచి ఒక గవర్నర్ పదవిని ఇచ్చారు. రెండవ గవర్నర్ పదవి అంటే అది ఇప్పట్లో ఉండకపోవచ్చు అని చర్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ పెద్దల ఆలోచనలు వేరేగా ఉంటాయని అంటున్నారు. మరీ అనివార్యం అయితే తప్ప వారు మిత్రులకు కీలక పోస్టులు ఇవ్వరు. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగడానికి టీడీపీ మద్దతు ఆక్సిజన్ గా ఉండడంతోనే ఒక గవర్నర్ పదవిని ఇచ్చారు అని అంటున్నారు. అయితే అది కూడా గోవా వంటి రాష్ట్రానికే ఇచ్చారు అన్న చర్చ ఉండనే ఉంది.

గౌరవమైన విరమణ కోసం :

ఇక యనమల విషయానికి వస్తే ఆయన వయసు ఏడున్నర పదులకు చేరుకుంది. ఈ మార్చిలో ఆయన ఎమ్మెలీ పదవి పూర్తి అయింది. ఒక విధంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నట్లే. రాజ్ భవన్ లో గవర్నర్ గా నియమితులైతే మరో అయిదేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి గౌరవనీయమైన పదవీ విరమణ చేయాలని భావించారు అని అంటున్నారు. కానీ ఇపుడు చూస్తే ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. పైగా మరో గవర్నర్ పదవి వస్తే రాయలసీమకు చెందిన బీసీ నేత అయిన కేఈ క్రిష్ణమూర్తికి ఇస్తారన్న ప్రచారం యనమల వర్గంలో కలవరపెడుతోంది.

పార్టీ ఎన్నో ఇచ్చింది :

ఇదిలా ఉంటే యనమల సీనియర్ నేతగా ఉన్నారని ఆయన పార్టీకి సేవలు చేసిన విషయం కరెక్టే అని అదే సమయంలో పార్టీ కూడా ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. యనమలకు అధికారంలో ఉంటే కీలక శాఖలకు మంత్రి పదవులు అలాగే స్పీకర్ పదవిని, ఇక విపక్షంలో ఉన్నా పీఏసీ చైర్మన్ పదవిని, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అంటున్నారు. అంతే కాకుండా ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా ఉన్నారని, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్నారని, వియ్యంకుడు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు రాజకీయాల్లో మిగిలిన వారికి కూడా పదవులు ఇవ్వాలన్నది ఒక విధానంగా ఉంటుంది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా యనమల మాత్రం రాజ్ భవన్ కి బహు దూరమేనా లేక ఏమైనా ఆశలు ఉన్నాయా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News