ఫేక్ ఖాతాలు పట్టేసేలా 'ఎక్స్' కొత్త ఫీచర్
ఒరిజనల్ అకౌంట్లకు ఏ మాత్రం తీసిపోకుండా వ్యవహరించే ఫేక్ ఖాతాల పని పట్టేందుకు ఎక్స్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ పుణ్యమా అని.. నకిలీగాళ్లకు చెక్ పడేందుకు అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలి.;
అసలు కంటే నకిలీ చేసే హడావుడి ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫేక్ రచ్చ ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి నకిలీగాళ్లకు చెక్ చెప్పేందుకు వీలుగా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ కాస్త ఆలస్యంగా స్పందించింది. ఫేక్ ఖాతాల గుట్టురట్టు అయ్యే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. నిజానికి ఇన్ స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఎప్పటి నుంచో ఇలాంటి ఫీచర్ ను అందిస్తున్నాయి. ఇప్పటికి కళ్లు తెరిచిన ఎక్స్.. నకిలీ ఖాతాల గుట్టు రట్టు చేసేందుకు వీలుగా ‘అటౌమ్ దిస్ అకౌంట్’ పేరుతో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్ కు సంబంధించిన పలు అంశాలు తెలుసుకునే వీలుంది. అవేమంటే..
- సదరు అకౌంట్ ను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు?
- ఎన్నిసార్లు యూజర్ నేమ్ మార్చారు?
- ఏ దేశం నుంచి అకౌంట్ ను నిర్వహిస్తున్నారు?
- ఏ తేదీన ఎక్స్ లో జాయిన్ అయ్యారు?
- యూజర్ నేమ్ ను అకౌంట్ హోల్డర్ ఎన్నిసార్లు మార్చారు
- గూగుల్ ప్లే నుంచి కనెక్టు అయ్యారా? యాపిల్ యాప్ స్టోర్ నుంచి కనెక్టు అయ్యారా?
ఒరిజనల్ అకౌంట్లకు ఏ మాత్రం తీసిపోకుండా వ్యవహరించే ఫేక్ ఖాతాల పని పట్టేందుకు ఎక్స్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ పుణ్యమా అని.. నకిలీగాళ్లకు చెక్ పడేందుకు అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలి. చాలా సందర్భాల్లో భారత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే కొందరు.. తమ జాతీయతను దాచేసి.. తాము కూడా భారతదేశానికి చెందిన వాళ్లమేనన్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. కన్ఫ్యూజ్ చేస్తుంటారు.
తాజా ఫీచర్ పుణ్యమా అని సదరు ఖాతా ఓపెన్ చేసింది ఎక్కడ? ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు? లాంటి వివరాలు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకునే వీలు ఉండటంతో.. నకిలీ ఖాతాలకు చెక్ పడే వీలుంది. కాస్త ఆలస్యంగా తీసుకొచ్చినా.. తప్పుడు పనులకు పాల్పడే వాళ్ల గుట్టు రట్టు అయ్యే ఈ ఫీచర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమని చెప్పక తప్పదు.