ముడతలు మంచివే !

ముడతలు మంచివే అంటే అయ్యో మొహం మీద ముడతలా ముసలితనం బయటపడిపోదూ అని ఆందోళన చెందుతున్నారా

Update: 2024-05-08 04:29 GMT

ముడతలు మంచివే అంటే అయ్యో మొహం మీద ముడతలా ముసలితనం బయటపడిపోదూ అని ఆందోళన చెందుతున్నారా ? మీకా ఆందోళన అక్కర్లేదు. ఇక్కడ ముడతల గురించి చెబుతున్నది మీరు ప్రతి రోజూ ధరించే బట్టల గురించి. ఇస్త్రీ లేనిదే బయటకు రాని అలవాటు మనది. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ముడతల దుస్తులు మంచివే అంటున్నది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌). ఇందుకోసం ప్రతి సోమవారం ఆ సంస్థ సిబ్బంది ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు రావాలని ఆదేశించడంతో ప్రస్తుతం వారి సిబ్బంది అదే పాటిస్తున్నారు.

వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు ‘స్వచ్ఛత పక్వాడ’లో భాగంగా ఈ నెల 1-15 తేదీల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం తాము వేసుకొనే దుస్తులను ఇస్త్రీ చేయకుండా ఉండటం ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తున్నారు. ఒకసారి ఒక జత బట్టల్ని ఇస్త్రీ చేస్తే 200 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి చేరుతుందని అంచనా. అందుకే వారంలో ఒక రోజు ఇలా ఇస్త్రీ లేని దుస్తులు ధరించాలని చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా సంస్థ పరిధిలోని అన్ని ప్రయోగశాలలు, పని ప్రదేశాల్లో విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా కరెంటు బిల్లును 10% తగ్గించాలని కూడా వారు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీన్ని ఈ ఏడాది జూన్‌-ఆగస్ట్‌ మధ్యలో అమలు చేస్తామని చెబుతున్నారు. అతి చిన్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించేందుకు ఎలా దోహదపడతాయో ప్రజలకు వివరిస్తామని వారు వెల్లడించారు.

Tags:    

Similar News