అచ్చం 'విక్రమార్కుడు' సినిమాలోలానే.. గుండు కొట్టి రూ. 15 వేలు ఇస్తామంటే నమ్మేశారు..

కటింగ్ పూర్తయింది, గుండ్లు మెరిసిపోతున్నాయి. ఇక నకిలీ ధనవర్షం కోసం సదరు కిలాడీగాడికి ఫోన్ కొట్టగా.. “ది నంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్” అనే మధురమైన వాయిస్ వినిపించింది.

Update: 2026-07-29 05:17 GMT

‘విక్రమార్కుడు’ సినిమాలో “గుండు కొట్టించుకుంటే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది.. లక్ష్మీదేవి కొలువై కోట్ల రూపాయలు కురిపిస్తుంది” అని రవితేజ అంటే అమాయక మహిళలు వరుసపెట్టి క్షౌరశాలకు పరిగెత్తిన సీన్ చూసి థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకున్నాం. కానీ అదే కామెడీ సీన్‌ను రియల్ లైఫ్‌లో అప్లై చేసి, అమాయక మహిళల జుట్టుతో విచిత్రమైన ‘గేమ్‌’ ఆడాడో తింగరి మోసగాడు.. తమిళనాడులో జరిగిన ఈ వింత మోసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కరోనా పోవాలి.. గుండు పడాలి

కథలోకి వెళ్తే.. తమిళనాడులోని పుదుకొత్తంబాడికి చెందిన పలనియమ్మాళ్ అనే మహిళకు ఇటీవల ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. “అమ్మా.. కరోనా లాంటి భయంకరమైన రోగాలు దరిచేరకుండా ప్రభుత్వం ఓ దివ్యమైన పథకం ప్రవేశపెట్టింది. మీరు గుండు కొట్టించుకుంటే చాలు.. ప్రభుత్వం నుంచి ఉచితంగా రూ. 15,000 మీ ఖాతాలో పడతాయి. ఈ లక్కీ డ్రాలో మొదటి పేరు మీదేనమ్మా!” అంటూ స్కీమ్ వివరాలను చాలా కలర్‌ఫుల్‌గా వివరించాడు.

తీరా ఆ మాటలు వినగానే పలనియమ్మాళ్ సంబరపడిపోయింది. 'గుండు కొట్టిస్తే రూ. 15 వేలా భలే ఆఫర్ ఉందే!' అనుకుందో ఏమో కానీ, ఈ 'గొప్ప' విషయాన్ని ఊర్లోని మరో ముగ్గురు మహిళలకు కూడా చేరవేసింది. రూపాయి ఖర్చు లేకపోయినా పైగా పదిహేను వేలు చేతికొస్తాయనే ఆశతో ఆ నలుగురు భామామణులు ఆలస్యం చేయకుండా వెంటనే బార్బర్‌ను పిలిపించి లైన్‌గా గుండ్లు కొట్టించేసుకున్నారు.

రూ. 15 వేలు దేవుడెరుగు.. ఆఖరికి మిగిలింది ‘బోడి గుండు’

కటింగ్ పూర్తయింది, గుండ్లు మెరిసిపోతున్నాయి. ఇక నకిలీ ధనవర్షం కోసం సదరు కిలాడీగాడికి ఫోన్ కొట్టగా.. “ది నంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్” అనే మధురమైన వాయిస్ వినిపించింది. దాంతో ఒక్కసారిగా మైండ్ బ్లాంకైన ఆ నలుగురు మహిళలకు, తమది 'విక్రమార్కుడు' సీన్ అని అర్థమై బోరున విలపించారు. పాపం.. నగదు సహాయం దేవుడెరుగు, ఉన్న జుట్టు పోయి ఊరి ముందర అవమానం మిగిలింది.

ఆలోచించాల్సిన విషయం

ఫోన్లలో 'ఉచితం', 'ఆఫర్', 'ప్రభుత్వ పథకం' అనగానే కళ్లు మూసుకుని నమ్మేస్తే చివరికి ఇలాంటి బోడి గుండు చందమే మిగులుతుంది. ఈ బాధితులు తీవ్ర ఆవేదనతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తమను దారుణంగా మోసం చేసిన ఆ మాయగాడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదైందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఏది ఏమైనా టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ధృవీకరించుకోకుండా ఫోన్ కాల్స్ నమ్మి ఇలాంటి ప్రయోగాలకు సిద్ధపడటం అమాయకత్వానికి పరాకాష్ట. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైనా ఫోన్లు వస్తే స్థానిక అధికారులను లేదా అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలి తప్ప, లేదంటే ఆ నకిలీ గాళ్లు మీకు తెలియకుండానే 'గుండు కొట్టేస్తారు'.

Tags:    

Similar News