దాడి మాస్టారు కోరిక తీరేనా ?
ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయన 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయన 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా వరసగా నాలుగు సార్లు గెలిచి అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన దాడి 2007 నుంచి 2013 దాకా శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. అయితే ఆయన వైసీపీలోకి వెళ్ళడంతో ఆయన రాజకీయ జీవితం మీదనే కాకుండా కుమారుడి రాజకీయ భవిష్యత్తు మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
అయ్యన్నతో సరిసమానంగా :
తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడితో సరిసమానంగా దాడి వీరభద్రరావు 1980, 1990 దశకంలో రాణించారు. ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చి ఎన్టీఆర్ గౌరవించారు. అలాగే కీలక శాఖలను కూడా ఈ ఇద్దరు నేతలూ చూశారు. పూర్వాశ్రమంలో హిందీ మాస్టార్ గా పనిచేసిన దాడి అంటే ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఆయనకు కీలక స్థానం పార్టీలో కల్పించారు. ఇదిలా ఉంటే పార్టీ పదవులలో కూడా దాడికి ప్రముఖ స్థానం ఉంటూ వచ్చింది. అయితే ఆయన 2013లో తన ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయలేదన్న కారణంతో టీడీపీని వీడారు. రాజకీయంగా అదే పెద్ద పొరపాటు అని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
అనకాపల్లిలో హవా :
అనకాపల్లిలో దాడి వీరభద్రరావు తన హవాను దశాబ్దాల పాటు చాటుకుంటూ వచ్చారు. ఎపుడైతే ఆయన టీడీపీని వీడారో నాటి నుంచే ఆయన ప్రాభవం తగ్గుతూ వచ్చింది. వైసీపీలో కూడా సరైన అవకాశాలు దక్కలేదు. దాంతో 2024 ఎన్నికల ముందు తిరిగి టీడీపీలో దాడి వీరభద్రరావు చేరారు. అయితే ఆయన కుమారుడు దాడి రత్నాకర్ కి అనకాపల్లి టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే 2029 ఎన్నికల మీదనే దాడి కుటుంబం ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు.
వారసులకు గుర్తింపుతో :
అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వారసులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా టీడీపీ సంకేతాలు పంపించింది. దాంతో దాడి లాంటి సీనియర్లలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయని అంటున్నారు. తన వారసుడిని కూడా ఎమ్మెల్యేగా చూడాలని దాడి మాస్టారు ఆశ పడుతున్నారు. అనకాపల్లిలో టీడీపీ బలంగా ఉంది. ఇక దాడికి ప్రత్యేక వర్గం ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల మీద ఫోకస్ పెట్టి దాడి కుటుంబం పనిచేస్తోంది. అయితే అనకాపల్లిలో టీడీపీకి ఎంతో మంది నాయకులు ఉన్నారు. టికెట్ కోసం భారీ పోటీ ఉంది. దాడి పార్టీని వీడాక చాలా మంది నాయకులు తయారయ్యారు. ఈ నేపధ్యంలో వారిని అందరినీ దాటుకుని అధినాయకత్వం మన్ననలు అందుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. ఇక పార్టీలో అవకాశాలు దక్కాలీ అంటే విధేయత కొలమాంగా చూస్తున్నారు.అలాగే పార్టీ కోసం కష్టించి పనిచేసే వారికే పట్టం కడుతున్నారు. మరి దాడి కుటుంబానికి న్యాయం జరుగుతుందా అన్నదే ఆయన అనుచరుల ఆలోచనగా ఉంది. మాస్టార్ రాజకీయ వారసత్వం కొనసాగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నప్పటికీ అనకాపల్లి టీడీపీ రాజకీయం మాత్రం అంత సానుకూలంగా లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.