భార్యలు చనిపోయిన భర్తలకు పెన్షన్... కార్యకర్త కోరికకు ఎమ్మెల్యే షాకింగ్ రిప్లై!

నాయకుల వల్ల ప్రజలు చెడిపోతున్నారా.. ప్రజల వల్ల నాయకులు చెడిపోతున్నారా అని అంటే... కోడి ముందా, గుడ్డు ముందా అనే ప్రశ్న గుర్తుకు వస్తుందని అంటారు.;

Update: 2025-07-19 14:16 GMT

నాయకుల వల్ల ప్రజలు చెడిపోతున్నారా.. ప్రజల వల్ల నాయకులు చెడిపోతున్నారా అని అంటే... కోడి ముందా, గుడ్డు ముందా అనే ప్రశ్న గుర్తుకు వస్తుందని అంటారు. ఈ క్రమంలో.. ఎన్నికల్లో నాయకులు ఇచ్చే హామీలకు పోటీగా అధికారంలో ఉన్న నేతలకు తగ్గట్లుగా ప్రజల కోరికలూ ఉంటున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యకర్త ఎమ్మెల్యేని కోరిన కోరిక వైరల్ గా మారింది.

అవును... వాస్తవానికి ఎమ్మెల్యే ఎదురైతే చాలా మంది రేషన్ కార్డుల గురించో, విద్యుత్, నీటి సమస్యల గురించో ప్రస్థావిస్తుంటారు.. రోడ్ల సమస్యలను ప్రధానంగా ప్రస్థావిస్తుంటారు. అయితే ఓ టీడీపీ కార్యకర్త రొటీన్ కి భిన్నంగా కోరారు. ఇందులో భాగంగా.. భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ ఇస్తున్నట్లే... భార్య చనిపోయిన భర్తలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఎమ్మెల్యేని కోరాడు. అదొకెత్తైతె.. ఎమ్మెల్యే ఇచ్చిన రిప్లై మరొకెత్తన్నట్లుగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం తక్కలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో.. ఓ టీడీపీ కార్యకర్త స్పందిస్తూ... భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ ఇస్తున్నట్లే.. భార్య చనిపోయిన భర్తలకు పెన్షన్ ఇప్పించాలని విన్నవించాడు. దీంతో.. కొంతమంది నవ్వగా, మరికొంతమంది ఆశ్చర్యపోయారు!

ఈ ప్రశ్నకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందిస్తూ... ఆ కార్యకర్త కోరికను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. భార్య చనిపోయిన భర్తలకు పెన్షన్ ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు. దీంతో.. అది నిజమో, వ్యంగ్యమో తెలియకో ఏమో కానీ... అక్కడున్న అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు! ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా... రోజు రోజుకీ సామాజిక పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలకు అర్ధం మారిపోతుందనే చర్చ నెట్టింట మొదలైంది.


Full View


Tags:    

Similar News