పార్లమెంటు డిప్యూటీ స్పీకర్.. 543 మందిలో అర్హులు ఒక్కరూ లేరా?

పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఎవరు? అన్న ప్రశ్నకు ఎవరూ లేరు అన్న సమాధానమే చెప్పాల్సివస్తోంది.;

Update: 2025-06-28 08:44 GMT

పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఎవరు? అన్న ప్రశ్నకు ఎవరూ లేరు అన్న సమాధానమే చెప్పాల్సివస్తోంది. ఏడాది క్రితం కొలువుదీరిన 18వ లోక్ సభకు ఓంబిర్లా స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సహాయంగా అదనంగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవాల్సివుంది. అయితే ఏడాది కాలంగా 18 లోక్ సభకు డిప్యూటీ స్పీకర్ ను ఎంపిక చేసే విషయంలో అధికార పక్షం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ప్రచారంలో ఉన్నాయి. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం మూడో విడత సర్కారును నడుపుతోంది. అయితే తొలి విడత పాలనలో మాత్రమే డిప్యూటీ స్పీకర్ ను ఎంపిక చేసిన ఎన్డీఏ కూటమి ఆ తర్వాత ఆ పదవి భర్తీ చేసే విషయంలో కనీస శ్రద్ధ కూడా ప్రదర్శించడం లేదని అంటున్నారు.

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి 2019 నుంచి ఖాళాగా ఉండిపోయింది. 2014లో తొలిసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ 16వ లోక్ సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామి అయిన అన్నా డీఎంకే నేత ఎం.తంబీదురైను డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆయన సుమారు నాలుగేళ్ల 285 రోజులు అధికారంలో ఉన్నారు. 16 లోకసభ పదవీకాలం పూర్తయిన తర్వాత తంబీదురై మాజీ అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 17వ లోక్ సభ కొలువుదీరినా.. డిప్యూటీ స్పీకర్ ను మాత్రం భర్తీ చేయలేదు. ఆ ఎన్నికల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాను ఏ పార్టీ దక్కించుకోలేదు. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన నుంచి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించేవారు. కానీ, 16వ లోక్ సభలో ప్రతపక్ష హోదా ఏ పార్టీకి లేకపోవడంతో ఎన్డీఏ కూటమి తన ఇష్టానుసారం మిత్రపక్షానికి ఆ పదవికి కేటాయించింది.

ఇక 2019లోనూ ఏ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించలేదు. అలా అని తన మిత్రపక్షానికి ఆ పదవిని కేటాయించలేదు. దీంతో 2019-24 మధ్య డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్లు లోక్ సభ నిర్వహించడం ఇదే తొలిసారిగా చెబుతారు. ఇక 2024 ఎన్నికల తర్వాత కూడా మరోసారి బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా, డిప్యూటీ స్పీకర్ నియామకంపై ఏడాదిగా దృష్టి పెట్టకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత రెండు సభల్లా బీజేపీకి పూర్తి బలం లేకపోవడంతో ఆ పార్టీ ఏకపక్ష నిర్ణయం చెల్లదన్న కారణంగా ప్రస్తుత సభకు డిప్యూటీ స్పీకర్ ను ఎంపిక చేయలేదని అంటున్నారు.

2024 ఎన్నికల తర్వాత లోక్ సభ స్పీకర్ గా 17వ సభకు స్పీకర్ గా వ్యవహరించిన ఓంబిర్లాకు మరో అవకాశం ఇచ్చారు. ఆయన హయాంలో సభను సమర్థంగా నడపడంతో ప్రధాని మోదీ రెండో ఆలోచన చేయలేదని అంటారు. వాస్తవానికి 18వ లోక్ సభ కొలువుదీరిన తర్వాత చాలా మంది పేర్లు స్పీకర్ పదవికి ప్రచారంలోకి వచ్చినా ప్రధాని నిర్ణయంతో ఓం బిర్లా రెండోసారి స్పీకర్ అయ్యారు. అయితే ఏడాదిగా డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రభుత్వం స్పందించకపోవడమే తాజాగా చర్చనీయాంశం అవుతోంది. ఎన్డీఏ 2.O సర్కారులో మాదిరిగా 3.O సర్కారులోనూ డిప్యూటీ స్పీకర్ లేకుండానే కాలం గడిపేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 543 మంది పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా డిప్యూటీ స్పీకర్ పదవికి అర్హులుగా అధికార పార్టీకి కనిపించడం లేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News