ఏపీకి కులాల దరిద్రం...అంత సులువుగా పోతుందా ?

ఏపీ రాజకీయాలు అంటేనే కులాల సమాహారంగా చెబుతారు. అసలు కులం ప్రస్తావన లేకుండా ఏపీలో రాజకీయం సాగడం లేదు.

Update: 2026-06-21 14:41 GMT

ఏపీ రాజకీయాలు అంటేనే కులాల సమాహారంగా చెబుతారు. అసలు కులం ప్రస్తావన లేకుండా ఏపీలో రాజకీయం సాగడం లేదు. అది ఇవాళా నిన్నా వచ్చినది కాదు. 1953 అక్టోబర్ 1న ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి ఏపీ విడిపోయినపుడు తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం అయ్యారు. అయితే అతి కొద్ది నెలలలోనే ఆయనను దించేశారు. దాని వెనక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలు ఉన్నాయని చెబుతారు. ఇక ఏపీ నాటి హైదరాబాద్ స్టేట్ విలీనం అయి 1956 రాష్ట్రం ఏర్పడింది. అపుడు కూడా హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామక్రిష్ణారావుకి చాన్స్ ఇవ్వనిది బలమైన కులాల ఆశల ఫలితమే అన్నది ఒక విశ్లేషణ.

కులంతోనే సాగుతోంది :

ఉమ్మడి ఏపీలో చూసుకుంటే ఒకసారి దళిత ముఖ్యమంత్రికి చాన్స్ వచ్చింది. మరోసారి ఒక బ్రాహ్మణుడికి సీఎం గా అవకాశం వచ్చింది. ఈ రెండు సార్లూ వారిని ఎక్కువ కాలం గద్దె మీద ఉండనీయకుండా చేసినది కుల రాజకీయమే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక ఏపీలో మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని ఏలింది. ఒకే కులానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు అని భావించే ఆల్టర్నేషన్ పాలిటిక్స్ అవతరించింది. అలా టీడీపీ పుట్టుకుని వచ్చింది. ఇక టీడీపీలో సీఎం లు అయిన వారు కానీ ఆ తరువాత బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ సీఎంలు అయిన వారు ఆయా పార్టీలను అత్యధికులు సొంతం చేసుకున్న సామాజిక వర్గాల నుంచే అన్నది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

చిరకాల కోరికగా :

ఇక ఈ రోజున ఒక బలమైన సామాజిక వర్గంగా కాపులు తమకు ముఖ్యమంత్రి పీఠం ఒక్కసారి అయినా దక్కాలని కోరుకుంటున్నారు. వారి ఆశలకు దారులు వెతుకుతున్న నేపథ్యం కూడా ఉంది. మరో వైపు బీసీల నుంచి సీఎం పదవి కావాలన్నది నినాదంగా ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన ఫ్రంట్ పేరుతో కొత్త రాజకీయ వేదికల సృష్టి వెనక బలమైన సిద్ధాంతాల కంటే తమ సామాజిక వర్గం వారికి రాజకీయ అధికారం దక్కాలని కోరిక బలంగా ఉండడమే అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం.

జనంలో ఉందా :

నిజం చెప్పాలి అంటే మొదట్లో జనంలో ఈ కుల భావన అయితే లేదు, కానీ తమ అవసరాలకు తగినట్లుగా రాజకీయ పార్టీలు ఓట్ల వేట కోసమే కుల భావనను పెంచి పెద్దది చేసి జనాల మీదకు రుద్దారు. ఇపుడు ప్రజలు ఆ కుల భావనలో అమాయకంగా కొట్టుకుని పోతూంటే అది వద్దు అని నేతలు ఇపుడు తాపీగా చెబుతున్నారు. నిజానికి ఇలా చెప్పే నేతలు ఎన్నికల వేళ తమ తమ పార్టీల తరఫున ఇచ్చే టికెట్లను ఒకసారి పరిశీలిస్తే వారు అన్ని సామాజిక వర్గాలను సంతృప్తి పరచాలన్న ఉద్దేశ్యంతోనే ఇస్తున్నారు అన్నది కూడా వాస్తవం. అంతే కాదు నామినేటెడ్ పదవులు ఆఖరుకు ఆలయాలలో దేవుడికి సేవ చేసుకునేందుకు ట్రస్టీ పదవులు అని చెప్పి వాటిని కూడా కులం కొలమానంతోనే చూస్తూ ఇస్తున్న నేపథ్యం ఉంది.

అల్లుకుపోయిన వైనం :

ఇంతలా కులం అన్నది ఏపీ సమాజంలో అల్లుకుని ఊడలు దిగిపోవడానికి కారణం రాజకీయ పార్టీలదే అన్న విశ్లేషణలు ఉన్నాయి. అంతే కాదు కులం అన్నది ఒక గుర్తింపుగా మార్చి అందలాలు ఎక్కించడం మొదలయ్యాక ఎవరూ ఆ బాట నుంచి సులువుగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉండరన్నది కూడా తెలిసిందే. ఈ రోజున కూడా ఇంత కుల భావన ఉన్నా కొన్ని సామాజిక వర్గాలకు రాజ్యాంగ పదవులు దక్కడం లేదు అన్నది కూడా ఆయా వర్గాలలో ఆవేదన ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత అన్నది వారు ప్రశ్నిస్తున్న విషయం. అలాగే ఏపీ కేబినెట్ లో తమకు స్థానం లేదా అని క్షత్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం ఉంది. అలాగే బీసీలలో చాలా ఉప కులాలు ఈ రోజుకీ రాజ్యాధికారం నోచుకోలేదని రోదిస్తున్నాయి. మరి ఇంతలా పెంచి పోషించిన కులాల కుంపటిని మహా సముద్రాలను తెచ్చి ఆర్పడానికి ప్రయత్నాలు చేసినా అవుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది మేధావుల బుర్రలను కూడా దొలిచేస్తున్న మాట.

Tags:    

Similar News