మామిడి కాయల ఖిల్లాలో టీడీపీ సీటెవరికి?

ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున నూజివీడులో ముగ్గురు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి

Update: 2024-01-23 01:30 GMT

మామిడి కాయలకు ప్రసిద్ధి చెందిన ఊరు.. నూజివీడు. వేసవి వచ్చిందంటే నూజివీడు మామిడికాయల మార్కెట్‌ లో సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సందడికి తోడు అసెంబ్లీ ఎన్నికల సందడి కూడా తోడవుతోంది. వైసీపీ తరఫున ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మరోసారి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన కూటమి ఇంకా ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడ కూటమి తరఫున టీడీపీనే పోటీ చేస్తుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున నూజివీడులో ముగ్గురు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుతోపాటు ఈసారి కొత్తగా ఎన్నారై పర్వతనేని గంగాధర్, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేర్లు నూజివీడు స్థానానికి టీడీపీ తరఫున వినపడుతున్నాయి.

నూజివీడు నుంచి 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. అయితే నూజివీడు నియోజకవర్గంలో అత్యధికంగా యాదవులు ఉన్నారు. అలాగే కాపు సామాజికవర్గం ఓటర్లు 35 వేలకు పైగా ఉన్నారు.

Read more!

ఈ నేపథ్యంలో టీడీపీ గత రెండు పర్యాయాలు యాదవ సామాజికవర్గానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు సీటు ఇచ్చింది. అయితే ఆయన స్థానికంగా నూజివీడులో నివాసం ఉండకపోవడం, వ్యాపారం రీత్యా విజయవాడలోనే నివాసం ఉండటం, ఎన్నికల సమయంలో మాత్రమే నూజివీడుకు రావడం వంటి కారణాలతో ఆయన 2014, 2019ల్లో ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఈసారి నూజివీడులో గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ నిర్ణయించుకుందని అంటున్నారు. ఇందులో భాగంగా యాదవ సామాజికవర్గానికే చెందిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి నూజివీడు సీటు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం కొలుసు పార్థసారధి వైసీపీ నుంచి తప్పుకున్నారు. ఆయనకు వైసీపీ అధినేత జగన్‌ పెనమలూరు సీటును నిరాకరించారు. ఈ నేపథ్యంలో పార్థసారధి టీడీపీలో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆయన తిరిగి తనకు పెనమలూరు సీటు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నట్టు చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం పార్థసారథి సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నూజివీడు నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు సమాచారం.

ఒకవేళ పార్థసారథి నూజివీడు సీటు నుంచి పోటీకి నిరాకరిస్తే టీడీపీ తరఫున ఎన్నారై పర్వతనేని గంగాధర్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఆర్థికంగా బలవంతుడు. ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారధి, పర్వతనేని గంగాధర్, ముద్రబోయిన వెంకటేశ్వరరావుల్లో ఒకరు నూజివీడు టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News