మరో ముప్పుపొంచి ఉంది.. డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ వ్యాఖ్యలు
ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయేసస్ తాజాగా ఒక సదస్సులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అన్నంతనే కరోనాకు ముందు వరకు ఆ సంస్థ మీద అపార గౌరవం ఉండేది ప్రపంచ ప్రజలకు. కరోనా కష్టకాలంలో ఆ సంస్థ వ్యవహరించిన తీరుతో డబ్ల్యూహెచ్ వో అన్నంతనే గయ్యమంటూ విరుచుకుపడేటోళ్లు బోలెడంత మంది. కష్టకాలంలో అండగా నిలవాల్సిన సంస్థ.. అందుకు భిన్నంగా చేతులెత్తేసినట్లుగా వ్యవహరించిందన్న తీవ్ర విమర్శను మూటకట్టుకోవటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బద్నాం అయ్యింది.
ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయేసస్ తాజాగా ఒక సదస్సులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని.. అది అనివార్యమని స్పష్టం చేశారు. అయితే.. ఈ మహమ్మారి ఎప్పుడైనా రావొచ్చన్న ఆయన.. ‘‘అదెప్పుడైనా సంభవించొచ్చు. 20 ఏళ్లు అంతకంటే ఎక్కువ లేదా రేపే జరగొచ్చు. ఏది ఏమైనా అది కచ్ఛితంగా జరిగి తీరుతుంది. అందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ క్లారిటీగా చెప్పి భయపెట్టేశారు.
కొవిడ్ మహమ్మారి క్రియేట్ చేసిన విలయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. కరోనా కారణంగా 70 లక్షలమంది చనిపోయినప్పటికీ.. వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రాణ నష్టమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లుగా చెప్పారు. మహమ్మారి ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రావొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఇందులో సభ్య దేశాల మధ్య డబ్ల్యూహెచ్ వో పాండమిక్ అగ్రిమెంట్ కు సంబంధించి కొన్ని అంశాలు ఒక కొలిక్కి రానున్నాయి.