చేపలు-గుడ్లు-మాంసం: ఎన్నికల్లో బీజేపీకి దడదడ!
అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. నిజమే!. కాదేదీ కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ అన్నట్టే.. ఎన్నికల ప్రచారంలోనూ.. ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునే విధానంలోనూ రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.;
అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. నిజమే!. కాదేదీ కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ అన్నట్టే.. ఎన్నికల ప్రచారంలోనూ.. ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునే విధానంలోనూ రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం లభించినా.. ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఏచిన్నలోపం అగుపించినా.. వదలకపోగా.. దానిని మరింత హైలెట్ చేస్తూ.. ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తద్వారా ఒక్క శాతం ఓటు బ్యాంకు మారినా.. తమ జాతకమే మారిపోతుందని పార్టీలు, నాయకులు కూడా అంచనా వేస్తున్నాయి.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బీజే పీ మధ్యే ఉంది. తృణమూల్‌ను గద్దెదింపేందుకు బీజేపీ అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. ఈక్రమంలో అనేక `మార్పులు` కూడా చోటు చేసుకున్నాయి. దీనికితోడు మూడు దఫాలుగా మమతా బెనర్జీ అధికారంలో ఉండడంతో ఆమెకు కూడా ఒకింత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందన్నది సహజంగానే వినిపిస్తున్న మాట. దీంతో తృణమూల్ వ్యూహాత్మకంగా సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో బీజేపీ దడదడలాడుతోంది.
``బీజేపీ కనుక అధికారంలోకి వస్తే.. ఇక.. మీరు తిని చేపలు ఉండవు.. మాంసం ఉండదు. చివరకు కోడిగుడ్లు కూడా ఉండవు.`` అని సీఎం మమతా బెనర్జీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ``వాళ్లు(బీజేపీ నాయకులు) ఏం తినరో.. వాటిని మీతో తిననివ్వరు. చేపలు తినకుండా అడ్డుకుంటారు. మాంసం తినకుండా హద్దులు విధిస్తారు. కోడిగుడ్లను కూడా అడ్డుకుంటారు. దీనిని మీరు హర్షిస్తారా?`` అంటూ.. మమతా బెనర్జీ ప్రజల్లో చర్చలేపారు. అంతేకాదు.. పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు.
చేపలతో ప్రచారం
ఈ తరహా ప్రచారం సెంటిమెంటుతో ముడిపడి ఉండడంతో ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇదే మమతకు కూడా కావా ల్సింది. ఇక, ఈవిషయం తెలిసిన బీజేపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటి వరకు ఎంత చేసినా, ఎన్నికలకు ముందు ఆహారపు అలవాట్లపై దెబ్బ పడుతోందని గమనించిన బీజేపీ అభ్యర్థులు.. ప్రజల మధ్యకు వెళ్లేప్పుడు చేపలను పట్టుకుని వెళ్తున్నారు. కొందరు కోడిగుడ్ల ట్రేలతో వెళ్తున్నారు. ``మేం ఆహార నియమాలకు వ్యతిరేకం కాదు. ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినొచ్చు.. మమత అన్నీ అబద్ధాలు చెబుతున్నారు`` అనివారు ప్రచారం చేస్తున్నారు.
అసలు ఎందుకొచ్చింది?
అయితే.. అసలు ఈ విషయం ప్రచారంలోకి ఎలా వచ్చిందనే సందేహం వస్తుంది. దేశంలో తొలిసారి చేపలు.. గుడ్లు, మాంసం వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలోకి వచ్చాయి. దీనికి కారణం.. బీహారే!. ఇటీవల ఇక్కడ బహిరంగంగా విక్రయించే చేపలు, మాంసంపై నిషేధం విధించారు. అంటే.. రోడ్డు పక్కన పెట్టుకునే దుకాణాలపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా ప్రజలకు, వ్యాపా రులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ సిన్హా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అయ్యాయి. ఈ విషయమే మమతకు ఆయుధంగా మారింది. బీహార్‌లో కొన్ని చోట్ల ఉద్యమాలు జరగడం.. పోలీసులు దుకాణ దారులపై కేసులు పెట్టడం వంటివి కూడా మమతకు అందివచ్చిన వ్యవహారంగా మారింది.