ఎల్‌నినో విశ్వరూపం... వరి పంటకు ఉరి !

సాధారణంగా దేశంలో నైరుతి రుతు పవనాలు మే నెలలో ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం ఆలస్యంగా జూన్ లో ఎంట్రీ ఇస్తున్నాయి.

Update: 2026-06-01 04:24 GMT

ఎల్‌నినో తన విశ్వరూపాన్ని ఈసారి భారత దేశంతో సహా ప్రపంచంలోకి పలు దేశాలలో చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక దేశంలో చూస్తే కనుక ఎల్‌నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్రం అసాధారణంగా వేడెక్కడం ద్వారా వాతావరణంలో కీలక మార్పులు సంభవిస్తాయి. దీని వల్ల రుతు పవన గాలులు బలహీనపడటం మొదలవుతాయి. వర్షపాతం లోటు అధికంగా ఈసారి ఉంటుంది.

జూన్ లో నైరుతి ఎంట్రీ :

సాధారణంగా దేశంలో నైరుతి రుతు పవనాలు మే నెలలో ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం ఆలస్యంగా జూన్ లో ఎంట్రీ ఇస్తున్నాయి. అలా జూన్ మొదటి వారంలో భారతదేశం లోకి ప్రవేశిస్తాయి. ఇవి అరేబియా సముద్ర తీరం ద్వారా మొదటగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కేరళను తాకిన తర్వాత ఇవి క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన సుమారు అయిదారు రోజుల తరువాత నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తాకుతాయి. అయితే ఈసారి ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ బలంగా నైరుతి రుతుపవనాలు ఉంటే భారీగా వర్షాలు కురుస్తాయి. ఇది ఖరీఫ్ కి సరైన సీజన్. మంచి వానలతో పంటలు వేసుకుంటారు. అలా తెలుగు రాష్ట్రాలలో ఏరువాక మొదలై వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులకు ప్రతికూలత ఎదురవుతుందని అంటున్నారు.

అతి తక్కువ వర్షపాతం :

ఇక ఈసారి చూస్తే దేశవ్యాప్తంగా అతి తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద సగటు కంటే తక్కువ వర్షపాతానికి ఎల్‌నినో ప్రభావం దారితీస్తుందని చెబుతున్నారు. దాదాపుగా 60 శాతం కంటే తక్కువ ఈసారి వర్షపాతం ఉంటుందని చెబుతున్నారు. దాంతో అనేక రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు దుర్భిక్షం కూడా నెలకొంటుందని అంటున్నారు. అలా దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా వంటి హీన రాష్ట్రాలలో కరువు లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎల్‌నినో ప్రేరేపిస్తుందని అంటున్నారు.

వ్యవసాయానికి భారీ నష్టం :

ఇక భారతదేశంలో చూస్తే వ్యవసాయంలో దాదాపు 60 శాతం ఖరీఫ్ సీజన్ నైరుతి రుతుపవనాలపైననే ఆధారపడి ఉంటుంది. అయితే బలహీనమైన వర్షపాతం వల్ల ఈసారి వరి, పప్పుధాన్యాలు చెరకు పంటల దిగుబడులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆహార కొరత గ్రామీణ ఆర్థిక ఇబ్బందులు పెరగడం ఆ మీదట జాతీయ ఆహార ద్రవ్యోల్బణం అధికం కావడం వంటివి సంభవించవచ్చునని అంచనా వేస్తున్నారు.

వరి సాగు చేయవద్దా :

ఈ నేపథ్యంలో చూస్తే వరి సాగు ఈసారికి ఏపీలో చేయవద్దు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలలో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని సీఆర్ఐడీఏ శాస్త్రవేత్త అయిన కేవీ రావు చెబుతున్నారు. అందువల్ల రైతులు అంతా ముందుగా వరి పంటను వేయవద్దు అని ఆయన అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే జూన్ లో కొన్ని వర్షాలు నైరుతి రాకతో పడే అవకాశం ఉంది. దానిని నమ్మి వరి పంటను వేస్తే మాత్రం ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. మరో వైపు చూస్తే వరికి అధిక నీరు అవసరమయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈసారి వర్షపాతం ఎంత ఆ విధంగా పంటకు ఎంత నీటి లభ్యత అన్నది చూసుకుని మరీ దానికి తగిన పంటలను వేయాలని ఆయన సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఎల్‌నినో ప్రభావం వరి పంటకు ఉరి వేసేలా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News