భారత్ కు అమెరికా బిగ్ షాక్

భారత్–అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ఒక కీలక పరిణామం అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకుంది.

Update: 2026-07-17 06:39 GMT

భారత్–అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ఒక కీలక పరిణామం అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకుంది. రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా సెనెట్‌లో "సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2026" బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఇప్పటికే 60 మందికి పైగా యూఎస్ సెనేటర్లు మద్దతు తెలపడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఈ చట్టం గనుక ఆమోదం పొందితే.. రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేసే దేశాల నుండి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అపరిమిత అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. రష్యా చమురుకు ప్రధాన కస్టమర్లలో ఒకటైన భారత్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

బిల్లు ముఖ్య ఉద్దేశం ఏమిటి?

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీయడం.. చమురు ద్వారా ఆ దేశానికి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన వ్యూహం. రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా లభించే ఆదాయం పరోక్షంగా ఉక్రెయిన్‌పై యుద్ధ కార్యకలాపాలకు నిధులుగా మారుతోందని అమెరికా గట్టిగా వాదిస్తోంది. ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలు చూస్తే.. భారత్, చైనా,

స్లోవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్ ఈ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. అయితే ఏ దేశంపై ఎంత శాతం సుంకం విధించాలనే విషయాన్ని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతి 180 రోజులకు ఒకసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఈ తరహా బిల్లులో ఏకంగా 500 శాతం టారిఫ్ ప్రతిపాదించినప్పటికీ తాజా ముసాయిదాలో దాన్ని 100 శాతానికి తగ్గించడం గమనార్హం.

రష్యా చమురుపై భారత్ ఎందుకు ఆధారపడింది?

ఇటీవల మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం తక్కువ ధరలకే లభిస్తున్న రష్యా ముడి చమురుపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. జూన్ నెలలో భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు పరిమాణం గణనీయంగా పెరిగింది. ఇది దేశ మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 34 శాతం వాటాను నమోదు చేసింది. సుమారు 4.5 బిలియన్ యూరోల విలువైన రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంతో.. చైనా తర్వాత రష్యాకు రెండో అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా భారత్ నిలిచింది.

భారత్‌కు దౌత్యపరమైన ఊరట ఉందా?

భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు జరుగుతున్న సమయంలో ఈ బిల్లు రావడం పెద్ద సవాలుగా మారినప్పటికీ ఇందులో ఒక సానుకూల అంశం కూడా ఉంది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడికి అవసరమైతే కొన్ని దేశాలకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. అందువల్ల భారత్‌పై పూర్తిస్థాయిలో టారిఫ్‌లు అమలవుతాయా లేదా అన్నది భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే దౌత్యపరమైన చర్చలపైనే ఆధారపడి ఉంటుంది.

ఈ బిల్లు ఆగస్టు నాటికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొంది చట్టంగా మారితే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, దేశ ఇంధన దిగుమతుల వ్యూహం ఏ విధంగా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం న్యూఢిల్లీ వర్గాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Tags:    

Similar News