వైసీపీ మబ్బు తెరలు దాటి రావాల్సిందేనా ?
దాంతో వైసీపీ ఇపుడు అసలు సిసలు పార్టీగా అవతరించక తప్పని అనివార్యతను కలిగి ఉంది అని అంటున్నారు.
వైసీపీకి ఇపుడు ఒక కఠినమైన పరీక్షా సమయంగానే విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ ఒకసారి అధికారంలో ఉండి విపక్షంలోకి వచ్చిన పార్టీ. అంతకు ముందు బలమైన విపక్షంగా కూడా కనిపించిన పార్టీ. 2011లో పార్టీ పెడితే ఇప్పటికి 15 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ మధ్యలో వైసీపీ రాజకీయ ప్రయాణం అంతా కూడా వైఎస్సార్ చరిష్మాతో అలాగే జగన్ ఇమేజ్ తోనూ సాగిపోయింది. కానీ 2024 నుంచే వైసీపీకి బలమైన పట్టు దొరకడం లేదు, జనాలకు చేరువ కావాలంటే అవసరం అయిన గట్టి సెంటిమెంట్ అన్నది కూడా అంది రావడం లేదు. దాంతో వైసీపీ ఇపుడు అసలు సిసలు పార్టీగా అవతరించక తప్పని అనివార్యతను కలిగి ఉంది అని అంటున్నారు.
వైసీపీకి చావో రేవో :
ఈసారి ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు కలసి మరోసారి జనం ముందుకు వస్తాయి. ఇందులో రెండో మాటకు తావు లేదు. దానికి కారణాలు ఎవరివి వారికి ఉన్నాయి. వైసీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉండబోతున్నాయి. వరుసగా రెండోసారి ఓటమి చెందితే కనుక వైసీపీని 2034 వరకూ కొనసాగించడం కష్టం అవుతుంది అని అంటున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందగాకే పునాది నుంచి ఉన్న నాయకులే చాలా మంది వదిలి వెళ్ళిపోయారు. దాంతో మరోసారి ఓటమి అంటే అది ఎలా ఉంటుంది అన్నది ఊహకే వదిలేయటం బెటర్ అని అంటున్నారు. అందుకే కూటమి పార్టీలు అన్నీ ఈసారి వైసీపీని ఓడించేందుకు కలసికట్టుగా రాబోతున్నాయని అంటున్నారు.
సంస్థాగతంగానే :
ఇక ఈసారి ఎన్నికలు సంస్థాగతంగా ఏ పార్టీకి ఎంత సత్తా ఉంది అన్నది నిరూపించకబోతున్నాయి. ఒకసారి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు తమకు ఉన్న యాంటీ ఇంకెంబెన్సీని అధిగమించి రెండవమారు వరసగా అధికారంలోకి రావాలీ అంటే కచ్చితంగా సంస్థాగతమైన బలాన్నే నమ్ముకోవాల్సిందే ఆ విషయంలో టీడీపీకి బూత్ లెవెల్ నుంచి గట్టిగానే బలం ఉంది. జనసేన విషయానికి వస్తే తమకు ఇప్పటిదాక ఉన్న బలాన్ని అభిమాన జనాన్ని సంస్థాగతంగా బలంగా నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. బీజేపీకి అయితే మొదటి నుంచి ఉన్న పార్టీ బలం ఉంది. దానిని పెంచుకోవాలని అనుకుంటోంది. మరి ఈ విధంగా మూడు పార్టీలు సవాల్ చేస్తే వైసీపీ కూడా సంస్థాగతంగానే గట్టి జవాబు చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
ఒక త్రాటి మీదకు చేర్చి :
వైసీపీ దశాబ్దరన్న క్రితం ఏర్పాటు చేసినప్పటికీ ఎప్పుడూ కూడా సంస్థాగతంగా గట్టి చేసుకోవాలని ఆలోచన చేయలేదని అంటున్నారు. ఆ పార్టీకి కూడా పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నారు. వారంతా వైఎస్సార్ కి జగన్ కి వీరాభిమానులు. వారు అలాగే కొనసాగుతున్నారు. అయితే వారు కసిగా పనిచేసినది మాత్రం 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే. 2024 ఎన్నికల్లో కాడే వదిలేశారు. అలాంటి వారిని మళ్ళీ 2029 నాటికి ఒక త్రాటి మీదకు చేర్చి పార్టీ గెలుపు కోసం గట్టిగా పనిచేయించుకోవాల్సిన బాధ్యత అయితే వైసీపీ హైకమాండ్ మీదనే ఉంది అని అంటున్నారు.
నినాదాల భ్రమలలో :
జగన్ ఎక్కడ పర్యటించినా కూడా జనాలు జాతర చేస్తున్నారు. అది విశాఖ అయినా భీమవరం అయినా కూడా జగన్ ని కాబోయే సీఎం అని అంటున్నారు. అదంతా బాగానే ఉంటుంది. జనాలతో హడావుడి కూడా హుషార్ గానే ఉంటుంది. కానీ ఎన్నికల్లో ఇవి కావు. బూత్ ల వద్ద నిలిచి ఓట్లు వేయించే వారే అవసరం అవుతారు. పైగా జగన్ ఇమేజ్ కంటే ఈసారి వైసీపీ బలం పార్టీ పరంగా గట్టిగా నిలిచి కూటమిని ఢీ కొనడమే కీలకమైన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా బూత్ లెవెల్ వద్ద ఎవరు అయితే పోరాడి విజయం సాధిస్తారో వారిదే రేపటి ఎన్నికల్లో అధికారం అవుతుంది. అంతే తప్ప బలం ఉందని జనాలు తమ వైపే ఉన్నారని భ్రమించి ఆ మబ్బులలో తేలిపోతే మాత్రం వైసీపీకి చేదు ఫలితాలే వస్తాయని అంటున్నారు. అందువల్ల వైసీపీ అధినాయకత్వం జనంలోకి వెళ్ళాలన్నది ఒక ఎత్తుగా పెట్టుకున్నా దానితో పాటుగా పార్టీ జనాలను కూడా పిలిచి మాట్లాడాలని సూచిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి బాధ్యతలు అప్పగించి రీచార్జి చేస్తేనే వైసీపీకి 2029 లో విజయం మీద ఆశలు ఉంటాయని అంటున్నారు.