బీజేపీ కీలక బిల్లులపై వైసీపీ స్టాండ్ అదేనా ?

గతంలోనే ఈ బిల్లులను మద్దతు ఇచ్చాం కాబట్టి అదే వైఖరిని కొనసాగించాలని ఆయన ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

Update: 2026-07-16 22:47 GMT

దేశంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఈసారి వర్షాకాల సమావేశాలలో కీలక బిల్లులను ప్రవేశపెడుతోంది. ఈ బిల్లులను వరసగా ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ మహిళా బిల్లులను ఆమోదించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం చూసింది. అయితే భారీ ఓట్ల తేడాతో ఈ బిల్లులు లోక్ సభలో వీగిపోయాయి. ఇపుడు మరోసారి ఆ బిల్లులను పార్లమెంట్ ముందుకు బీజేపీ తీసుకుని వస్తోంది. ఈసారి వీటికి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ భావిస్తోంది. దేశంలో చూస్తే ఇండియా కూటమి అయితే తన నిర్ణయంలో మార్పు లేదని అంటోంది.

ఆ రెండు పార్టీల మీదనే :

మరో వైపు చూస్తే ఇరవై మందికి పైగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎన్ సీపీఐ అన్న వేరే పార్టీలో చేరి బీజేపీకి ఎన్డీయేకు మద్దతుగా ఉన్నారు. అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి ఆరుగురు ఎంపీలు వచ్చి ఏక్ నాధ్ షిండే పార్టీకి బాసటగా నిలబడ్డారు. వారు ప్రత్యేక వర్గంగా లోక్ సభలో గుర్తింపు పొందుతున్నారు. అదే విధంగా తమిళనాడులో పెద్ద పార్టీ అయిన డీఎంకే నుంచి 22 మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు, వీరు కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన న్యూట్రల్ పార్టీల సంగతి ఏమిటి అన్న చర్చ వస్తోంది.

వైసీపీ మద్దతు ఎవరికి :

ఇక ఏపీలో చూస్తే కూటమి పార్టీలు వైసీపీకే పార్లమెంట్ లో ఎంపీల బలం ఉంది. వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన బిల్లులకు ఈ ఎంపీల మద్దతు కూడా చాలా కీలకంగా ఉంటుంది. గతంలో అంటే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా వైసీపీ డీలిమిటేషన్ బిల్లుకు మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించింది, ఇపుడు కూడా వైసీపీ అదే స్టాండ్ తో ఉండనుంది. ఈ విషయాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.

ఏపీ ఎంపీలు అంతా :

గతంలోనే ఈ బిల్లులను మద్దతు ఇచ్చాం కాబట్టి అదే వైఖరిని కొనసాగించాలని ఆయన ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. దాంతో కీలకమైన ఈ సమయంలో వైసీపీ నుంచి ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లులకు పూర్తి స్థాయి మద్దతు లభించబోతోంది అన్న మాట. ఇది భారీ ఊరటను ఇచ్చే విషయంగానే చూస్తున్నారు. అదే సమయంలో ఏపీ నుంచి మొత్తం పాతిక మంది లోక్ సభ సభ్యులు, అలాగే 11 మంది రాజ్యసభ మెంబర్స్ కూడా ఎన్డీయేకు అండగా ఉంటున్నారు అన్నది కూడా మరొసారి తేటతెల్లమవుతోంది. ఒక విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ నుంచి ఎన్డీయే సర్కార్ కి నూరు శాతం మద్దతు లభిస్తోంది అని చెప్పుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు గళం విప్పాలని జగన్ కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను పార్లమెంట్ వేదికగా గట్టిగా చాటాలని ఆయన కోరారు. మొత్తం మీద చూస్తే వైసీపీ ఎన్డీయే బిల్లులకు ఓకే అని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు అయింది.

Tags:    

Similar News