ఉమ్మడి కుటుంబాలు...అదృశ్యమైన అందమైన లోకం
పూర్వకాలంలో అమ్మమ్మ తాతయ్య పెంపకంలో అనుభవసారం రంగరించి నైతిక విలువలను పిల్లలలో నూరి పోసి భావి పౌరులుగా తీర్చిదిద్దేవారు.
ఒకపుడు ప్రతీ పల్లె ఒక ఉమ్మడి కుటుంబం. అక్కడ వివిధ సామాజిక వర్గాలు ఉన్నా అంతా కలసి జీవించేవారు. పేర్లు పెట్టి పిలుచుకోవడం కంటే కూడా బంధాలను కలుపుకుంటూ ఒక అందమైన జీవితాన్ని ఆవిష్కరించారు. అన్నా తమ్ముడూ బావా బావ మరిది మామా అల్లుడూ అత్తా పిన్నీ అక్కా చెల్లి ఇలా రక్తబంధాలనే ముడి వేసి మరీ పల్లెసీమలు అనురాగాలకు పుట్టిల్లుగా ఉండేవి. అక్కడ ఆర్థిక సామాజిక భేద భావం లేదు, వివక్ష లేదు, అంతా కలసి ఒక్కటిగా ఉండేవారు. ఒక ప్రతీ పల్లెలో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కనీసం పాతిక మంది ప్రతీ పూటా విస్తర్లు వేసి భోజనాలు చేసేవారు. పండుగలు వస్తే ఆ సంఖ్య నాలుగింతలు అయ్యేది. అంతటి అందమైన లోకం ఒక్కసారిగా మాయం అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చదువులు ఉపాధి అవకాశాలతో అంతా కలసి పట్టణాలకు ఆ మీదట రాష్ట్రాలను దాటి దేశాలకు వెళ్ళిపోయారు. దాంతో పల్లె కాస్తా పూర్తిగా చిన్నబోయింది. ఉమండి కుటుంబాలు సైతం చిన్నా భిన్నం అయిపోయాయి.
అతి చిన్న కుటుంబాలుగా :
కాల గమనంలో అతి చిన్న కుటుంబాలు ఏర్పాటు అయ్యాయి. మేమిద్దరం మాకిద్దరు అన్న విధానం వచ్చేసింది. పెద్దలు ఎక్కడా కనిపించని పరిస్థితి. గత మూడు దశాబ్దాలుగా చూస్తే ప్రతీ కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే కనిపిస్తున్నారు. వెనకటి తరాలు కానీ ఆ బంధుత్వాలు బంధాలు కానీ మచ్చుకైనా కారణం లేదు. ఈ తరానికి తెలిసిందల్లా అంకుల్స్ అండ్ ఆంటీస్. ఈ రెండింటి మధ్య కూడా తెలుగులో తేడా ఏ మాత్రం తెలియదు. అందరికీ అవే పదాలు ఉపయోగిస్తున్నారు పైగా ఈ అంకుల్స్ అండ్ అంటీస్ అంతా సొంత వారు కాదు, ఎవరు కాస్తా పరిచయం అయినా వారికి ఈ బంధం కలిపేసి అందులోనే ఎంతో ప్రేమ ఉందని భ్రమిస్తూ బతికేస్తున్నారు.
నైతిక బోధన ఏదీ :
పూర్వకాలంలో అమ్మమ్మ తాతయ్య పెంపకంలో అనుభవసారం రంగరించి నైతిక విలువలను పిల్లలలో నూరి పోసి భావి పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఏ పాఠశాలలో నేర్పని జీవిత పాఠాలను వారికి చక్కగా ఓపికగా చెప్పేవారు. అందుకే వారంతా మానసికంగా చాలా బలంగా ఉండేవారు. సమస్య వస్తే కృంగిపోయేవారు కాదు, కానీ ఇపుడు సమస్య వస్తే పెద్ద భూతంగా మారుతోంది. ఒంటరిగా ఉన్న ఈనాటి తరం దాన్ని అధిగమించలేక అఘాయిత్యాలకు పాల్పడుతోంది. అంతే కాదు సైకో మనస్తత్వం కూడా ఎక్కువగా పెరిగిపోతోంది. అయితే సాంకేతికత పెచ్చుమీరిన ఈ నాటి కాలంలో ఆధునికత సంతరించుకున్న ఈ యుగంలో ఇదే కరెక్ట్ అని అంతా ముందుకు సాగిపోతున్నారు. ఇదే అనివార్యంగా కూడా మారిపోతోంది. మరి ఇది మారుతుందా మార్చే పరిస్థితి ఉందా అంటే ముందుకు వెళ్ళిన ఈ విధానం వెనక్కి వస్తుందా అన్నది అతి పెద్ద ప్రశ్నగానే ఉంటుంది.
చంద్రబాబు నినాదం :
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి కుటుంబాలు అని నినదిస్తూ వస్తున్నారు. ఆయన ఏ సభలో మాట్లాడినా ఇదే వినిపిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఉంటాయి. పోలీసులు ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి. కానీ కోట్లాది కుటుంబాలలో జరిగేది ఎవరూ కనిపెట్టలేరు, అఘాయిత్యాలను ఎవరూ ఆపలేరు. అదే నైతిక నిష్ట తో నడిచే సమాజం ఉంటే చట్టాలు పోలీసు బలగాల అంటే అవే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నేరం చేయడానికే వెనకాడే వ్యవస్థ రావాలీ అంటే అది సమాజంలో యూనిట్ గా ఉన్న కుటుంబాల తీరు మారడం నుంచే రావాలి. అందుకే చంద్రబాబు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండాలని అంటున్నారు.
మానవ సంబంధాలు తగ్గుదల :
వర్తమాన సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందని చంద్రబాబు అన్నారు. ఈ కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కూడా వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబాలు రావాలని మైక్రో ఫ్యామిలీలు కాదని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. మరి ఉమ్మడి కుటుంబాలు మంచివే కానీ అది సాధ్యమా ఆ దిశగా సమాజం అడుగులు వెనక్కి వేస్తుందా అన్నదే ఇపుడు ఒక కీలక చర్చగా ఉంది. చూడాలి మరి ఆ రోజులు వస్తాయేమో.
.