బీజేపీ భజన.. విజయసాయిరెడ్డి ట్వీట్ కు అర్థమిదేనా?

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ వి.విజయాసాయిరెడ్డి బీజేపీ భజన చేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2026-07-17 08:01 GMT

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ వి.విజయాసాయిరెడ్డి బీజేపీ భజన చేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలే చేయనంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన అడపాదడపా రాజకీయ పరమైన ప్రకటనలు చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించనున్నారనే వార్తలపై తాజాగా స్పందించిన విజయసాయిరెడ్డి ఆ వార్తలు నిజమైతే స్వాగతించాల్సిందేనంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లు విజయసాయిరెడ్డి బీజేపీ భజన చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలే వద్దని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీతో స్నేహం కోరుకుంటున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరాలని చూస్తున్నారని, కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు అడ్డుకుంటున్నాయనే ఊహాగానాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇవి నిజమో అబద్దమో కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఈ ప్రచారాన్ని అసలు పట్టించుకోనట్లే వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయానికి బలం చేకూర్చేలా నడుచుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ కూడా హాట్ టాపిక్ అవుతోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించడాన్ని స్వాగతించాలని చెప్పడమే కాకుండా, అమిత్ షాను దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పోల్చడం కూడా చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ చతురుత, పరిపాలన సామర్థ్యం ఉన్న అమిత్ షా ఉప ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు పూర్తిగా అర్హలు అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో కొనియాడారు. అంతేకాకుండా ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పదవిని చేపట్టడం కూడా సముచితమేనంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అయితే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో అమిత్ షా ఉప ప్రధాని కాబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అమిత్ షా ఉప ప్రధాని అంటూ జరుగుతున్న ప్రచారం నిజం అవ్వాలని కోరుకోవడమే విశేషంగా చెబుతున్నారు. రాజకీయాలే వద్దని చెప్పిన విజయసాయిరెడ్డి బీజేపీ అగ్రనేతలకు దగ్గర అవ్వాలనే ఆలోచనతోనే ఈ ట్వీట్ చేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా విజయసాయిరెడ్డి ఎదుర్కొంటున్న పలు కేసుల కారణంగా బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా విజయసాయిరెడ్డి ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News