సినిమా ట్విస్టులను మించేలా.. దళపతి విజయ్ సర్కార్ కూల్చేందుకు కుట్రలు?
ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా, ఇప్పటివరకు సుమారు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
యాక్టర్ టు పొలిటీషియన్ గా మారి పార్టీ పెట్టిన రెండేళ్లలోనే సంచలన విజయం నమోదు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ సర్కారును కూల్చేందుకు భారీ కుట్ర జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది. ‘ప్రాజెక్టు మేఘాలయ’ అనే పేరుతో డీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ తోపాటు కొందరు జర్నలిస్టులు, యూట్యూబర్లు కలిసి టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు ప్రభుత్వానికి అంతర్గత నివేదిక సమర్పించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఓ సీనియర్ జర్నలిస్టును విచారించిన పోలీసులు అతడి మొబైల్ ను స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కుట్రకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే పార్టీ మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన బలం సొంతంగా లేకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని విపక్షాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిగాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఐపీడీఎస్ అనే ఓపీనియన్ పోల్ సంస్థ నిర్వాహకుడు, యూట్యూబర్ తిరునావుక్కరసు తనకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారని ఊతంగరై ఎమ్మెల్యే ఎన్.ఇళయరాజా గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా, ఇప్పటివరకు సుమారు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తిరునావుక్కరసుతోపాటు ఒక ప్రముఖ న్యూస్ చానల్ కి చెందిన సీనియర్ జర్నలిస్టు కూడా ఈ కుట్రలో భాగం అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను విచారించిన పోలీసులు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్ లో కీలక సమాచారం సేకరించారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీరంతా కుట్ర చేయడమే కాకుండా, తమ ఆపరేషన్ కు ‘ప్రాజెక్టు మేఘాలయ’ అనే పేరు పెట్టారని చెబుతున్నారు.
ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ కేసు దర్యాప్తు పెను సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేతలకు ఉచ్చు బిగించేలా పోలీసులు అడుగులు వేస్తున్నారనే ప్రచారం ద్రవిడ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ప్రస్తుతం కొందరు పాత్రధారులను అరెస్టు చేసినప్పటికీ వారిచ్చిన సమాచారంతో సూత్రధారులను త్వరలో అదుపులోకి తీసుకోవచ్చునని అంటున్నారు. దీంతో డీఎంకేలో ఏ స్థాయి నేతల పాత్ర బయటపడుతుందనే టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కి పోలీసులు సమన్లు జారీ చేశారని, వారిని విచారించిన తర్వాత మరికొందరినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. పోలీసుల విచారణ జరుగుతున్న తీరు పలువురు నేతలకు టెన్షన్ కు గురిచేస్తోందని చెబుతున్నారు.