వరంగ‌ల్ జాబ్ మేళా.. సీఎం రేవంత్‌కు నేర్పుతున్న పాఠం ఏంటి?

వ‌రంగ‌ల్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన "జాబ్ మేళా" అనే అంశాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చేసింది.;

Update: 2025-04-12 07:40 GMT

రాష్ట్రంలో 50 వేల మందికి తాము ఉద్యోగాలు ఇచ్చామ‌ని.. ఇంతక‌న్నా ఎవ‌రు మాత్రం చేయ‌గ‌ల‌ర‌ని.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం క‌న్నా.. తాము నిరుద్యోగ యువ‌తను ప‌ట్టించుకుంటున్నా మ‌ని.. కేవలం 15 నెల‌ల పాల‌న‌లో 50 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. మంచిదే. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు? స‌ర్కారుపై వారు ఎన్ని ఆశ‌లు పెట్టుకున్నారు? అన్న విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌రంగ‌ల్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన ``జాబ్ మేళా`` అనే అంశాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చేసింది.

మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో వ‌రంగ‌ల్ తూర్పు నియోక‌వ‌ర్గంలో శుక్ర‌వారం జాబ్ మేళా నిర్వ‌హించారు. దీనిని వ‌రంగ‌ల్ వ‌రకే ప‌రిమిత‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ జాబ్ మేళాలో.. 22కు పైగా ప్రైవేటు సంస్థ‌లు పాల్గొని.. నిరుద్యోగుల నుంచి అప్లికేష‌న్లు తీసుకున్నాయి. అంతేకాదు.. కొంద‌రికి అప్ప‌టిక‌ప్పుడే అప్పాయింట్ మెంట్లు కూడా ఇచ్చాయి. ఇవ‌న్నీ ప్రైవేటు ఉద్యోగాలు. వీటిలో రూ.10-40 వేల వ‌ర‌కు వేత‌నాలు ఉన్న ఉద్యోగాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయా నిరుద్యోగుల నైపుణ్యాలు, విద్య‌, డిగ్రీలు, భాషలు ఇలా.. అనేక కోణాల్లో ప‌రిశీలించి వారిని ఎంపిక చేసుకునే ప్ర‌క్రియ కొన‌సాగింది.

అయితే.. ఇవి ప్రైవేటు ఉద్యోగాలే అని, త‌క్కువ సంఖ్య‌లోనే వీటిని భ‌ర్తీ చేయ‌నున్నార‌ని తెలిసి కూడా.. యువ‌త భారీ సంఖ్య‌లో పోటెత్తింది. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయ‌న్న సంగ‌తిని ముందు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. నిరుద్యోగులు ల‌క్ష‌ల‌సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చా రు. ఒకానొక ద‌శ‌లో క్రౌడ్ మేనేజ్‌మెంటు కోసం.. పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పాల్సి వ‌చ్చిందంటే.. స‌మాజంలో ముఖ్యంగా రాష్ట్రం లో నిరుద్యోగ తీవ్ర ఎలా ఉందో.. అర్ధం అవుతోంది. ప్రైవేటు ఉద్యోగాల‌కు ఇలా క్యూ క‌ట్ట‌డం.. ఇటీవ‌ల కాలంలో ఇదే తొలిసార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వ‌చ్చిన వారు ఒక్క వ‌రంగ‌ల్‌కు చెందిన వారు మాత్ర‌మే కావ‌డం కూడా.. చ‌ర్చ‌నీయాంశం.

ఇక‌, ఇత‌ర జిల్లాల్లో ఇలా జాబ్ మేళా పెడితే.. ఇంకెంత మంది వ‌స్తారో.. అనే చ‌ర్చ కూడా ఉంది. ఏదేమైనా.. 50 వేల మంది ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పుకొంటున్నా.. ఇదే గొప్ప అని భావిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ల‌క్ష‌ల సంఖ్య‌లో నిరుద్యోగులు ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తీరు మాత్రం తాజా వరంగ‌ల్ ఘ‌ట‌న‌తో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు అయింది. కాబ‌ట్టి.. ప్ర‌భుత్వం నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌ను మ‌రింత తీవ్రంగా గుర్తించి.. సొంత‌గా ఎదిగేందుకు.. లేదా ప్రైవేటును ప్రోత్స‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని.. లేక‌పోతే.. నిరుద్యోగుల ప్ర‌భావం ప్ర‌భుత్వంపై ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు హెచ్చ‌రిస్తున్నారు.

Tags:    

Similar News