ఆర్ఎస్ఎస్ టార్గెట్...రాహుల్ చెప్పినట్లే అవుతుందా ?

అంతటితో ఆగని ఆయన ఆర్ఎస్ఎస్ తర్వాత టార్గెట్ ఏమిటో కూడా చెప్పారు. ఆర్ఎస్ఎస్ కాధలిన్ చర్చిలను క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.;

Update: 2025-04-06 12:30 GMT

దేశంలో వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే దాని ప్రకంపనలు మాత్రం దేశమంతా అలాగే ఉన్నాయి. ఈ బిల్లు చట్టం అవుతున్న వేళ అడ్డుకునేందుకు ఇతర మార్గాలను ప్రత్యర్ధులు అన్వేషిస్తున్నారు. కొందరు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. మరి కొందరు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని బిల్లు మీద సంతకం చేయకుండా విన్నపం చేయాలని చూస్తున్నారు

వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో అయితే దేశంలోని విపక్షాలు అన్నీ ఆగ్రహంగానే ఉన్నాయి. ఇక ప్రత్యేకించి ఒక వర్గం నాయకులు అయితే నిరసనలు వ్యక్తం చేస్తూనే ప్రతిపక్షాల నిస్సహాయత మీద కూడా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వక్ఫ్ బిల్లుని కేంద్రం ఆమోదించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని దుయ్యబెట్టారు. బీజేపీ ఆలోచనలను కూడా ఆయన తప్పుపట్టారు.

అంతటితో ఆగని ఆయన ఆర్ఎస్ఎస్ తర్వాత టార్గెట్ ఏమిటో కూడా చెప్పారు. ఆర్ఎస్ఎస్ కాధలిన్ చర్చిలను క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. దానికి ఆయన ఆర్ఎస్ఎస్ తన వెబ్ సైట్ లో రాసిన ఒక వ్యాసాన్ని ఉదహరిస్తున్నారు. భారత దేశంలో కాథలిన్ సంస్థలకు ఏకంగా ఏడు కోట్ల హెక్టార్ల భూమి ఉందని ఆ వ్యాసంలో రాసిన విషయాన్ని ట్వీట్ లో పంచుకున్నారు. ఈ రోజుకు దేశంలో అతి పెద్ద ప్రభుత్వేతర భూ యజమానులుగా కాథెలిన్ సంస్థలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ పేర్కొంది అని రాహుల్ గాంధీ గుర్తు చేస్తున్నారు.

తాను వక్ఫ్ బిల్లు ముస్లింల మీద దాడిగా గతంలోనే చెప్పాను అని ఆయన అంటున్నారు. ఇపుడు చూస్తే ఇతర వర్గాలను కూడా ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం క్రైస్తవ సమాజం కూడా ఇబ్బందులో పడినట్లే అని తేల్చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ వెబ్ సైట్ వ్యాసంలో ఏముంది అన్నది చూస్తే కనుక దేశంలో ఎవరికి ఎంత ఎక్కువ భూమి ఉంది అంటూ కాథలిన్ చర్చి వర్సెస్ వక్ఫ్ బోర్డు చర్చ అని హెడ్డింగ్ తో ఆ వ్యాసం సాగుతుంది. ఇక కాథలిన్ సంస్థలకు దఖలు పడిన భూమిలో అత్యధిక భాగాని బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని ఏలుతున్న కాలంలో అంటే 1927లో ఇండియన్ చర్చి చట్టం ద్వారా దఖలు పడిందని పేర్కొన్నారు.

వలసవాదుల కాలంలో లీజుగా తీసుకున్న ఈ తరహా భూములను ఇక మీదట చర్చి ఆస్తిగా గుర్తించబోమని 1965 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఈ వ్యాసంలో గుర్తు చేశారు. ఇలా సాగిన ఈ వ్యాసాన్ని ఇపుడు రాహుల్ తన ట్వీట్ లో ప్రస్తావిస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ టార్గెట్ కాథలిన్ చర్చి భూములే అని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలా కూడా ఆరోపిస్తున్నారు. మరి అలా జరుగుతుందా రాహుల్ చెప్పిందే అవుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా రాహుల్ వ్యాఖ్యలు అయితే ఇపుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

Tags:    

Similar News