ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌ న్యూస్ చెప్పిన చంద్రబాబు... ఆ పదవి అప్పగింత!

ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

Update: 2024-04-27 04:28 GMT

తమకు కచ్చితంగా టిక్కెట్ దక్కుతుందని ఆశపడి, దానికి తగ్గట్లుగా హామీ కూడా లభించడంతో టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే! ఎమ్మెల్యే టిక్కెట్ కానీ, బాపట్ల ఎంపీ టిక్కెట్ కానీ ఆమెకు దక్కలేదు. ఈ సమయంలో ఆమె "రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది! 🗡️!" అంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే ఆమెకు బాబు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.

అవును... ఎమ్మెల్యే టిక్కెట్ కానీ, ఎంపీ టిక్కెట్ కానీ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించిన ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్వీట్ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు చంద్రబాబు ఒక ఆఫర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమెకు పార్టీలో పదవిని అప్పగించారు. ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నియమించారు.

ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. అయితే... ఈ పదవిని ఆమె మనస్పూర్తిగా స్వీకరిస్తారా.. లేక, లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి! కారణం... చాలా మంది ఈ పదవులను ఆరోవేలుగా చూస్తారనే గుసగుసలు రాజకీయాల్లో వినిపిస్తుండటమే!!

ఇదే సమయంలో... తిరుపతి ఎంపీ టికెట్ ఆశించి బంగపడ్డ పనబాక లక్ష్మికి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా... ఆమెను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇదే క్రమంలో... బాపట్ల లోక్‌ సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్‌ ను నియమించారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేశ్‌ నాయుడును రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.

ఇక రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కోడూరు బాలసుబ్రమణ్యం, ఉన్నం మారుతిచౌదరిలను.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా మాన్వి దేవేంద్రమ్మ, కనపర్తి శ్రీనివాసరావు, గుడిసె ఆదికృష్ణమ్మ, కేఎం జకీవుల్లా, ఇందుకూరి సుబ్బలక్ష్మి, కేవీవీ సత్యనారాయణరావు, పుట్టం బ్రహ్మానందరెడ్డి, జంపాల సీతారామయ్యని నియమించారు. ఇలా టికెట్లు ఆశించి బంగపడ్డ నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు!

Tags:    

Similar News