అర్ధరాత్రి ఫోన్.. ఒంటరిగా వెళ్లిన ఎమ్మెల్యే గల్లా మాధవి!
గుంటూరు నగరంలో హల్ చల్ చేస్తున్న గంజాయి బ్యాచ్ వెంటపడి తరిమిన మాధవి టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నారు.;
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. గత నెల 31న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ భారీ ఆందోళనకు దిగి టీడీపీ శ్రేణుల ప్రశంసలు అందుకున్న మాధవి.. ఈ సారి పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు ఎపిసోడ్ లో లేడీ సింగంగా మాధవిని అభివర్ణించారు. అయితే ఆ పేరును సార్థకం చేసేలా బుధవారం రాత్రి మాధవి నడుకున్నారని చెబుతున్నారు. గుంటూరు నగరంలో హల్ చల్ చేస్తున్న గంజాయి బ్యాచ్ వెంటపడి తరిమిన మాధవి టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నారు.
రాజకీయాల్లో లేటెస్ట్ ఎంట్రీ అయినా అదరగొడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. మాజీ మంత్రి అంబటి ఎపిసోడులో రాజకీయంగా ఎలాంటి విమర్శలు వచ్చినా.. సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు అభిమానాన్ని కొల్లగొట్టారు ఎమ్మెల్యే మాధవి. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో మాధవి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్ అవుతోంది. ముఖ్యంగా అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత.. అంబటి కుమార్తె మౌనిక, మాజీ మంత్రి రజిని వంటి వారితో మీడియా ముఖంగా డైలాగ్ వార్ నడిపించి రాజకీయంగా తన దూకుడు ఎలా ఉంటుందో నిరూపించారు మాధవి.
ఇక పరిపాలనలోనూ అంతే వేగంగా స్పందిస్తున్నాంటూ తాజాగా నిరూపించుకున్నారు ఎమ్మెల్యే. తన నియోజకవర్గం పరిధిలోని గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఏరియాలో కొందరు ఆకతాయిలు గంజాయి సేవించి నానా రభస సృష్టిస్తుంటే, సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మాధవి ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి అల్లరిమూకలను తరిమేసిన సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. గంజాయి మూకలు రాత్రి సమయంలో చేస్తున్న అల్లరితో విసిగిపోయిన స్థానిక మహిళలు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నేరుగా ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. ఆ అర్ధరాత్రి సమయంలో పరిస్థితిని అర్ధం చేసుకున్న ఎమ్మెల్యే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ద్విచక్ర వాహనాన్ని తీసుకుని స్పాట్ కు వెళ్లిపోయారు.
గన్ మన్ లు, అనుచరులు వంటివారు ఎవరూ లేకుండా కనీసం కారు కూడా తీయకుండా, ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే మాధవి రాత్రి సమయంలో రావడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇక ఆమెను చూసిన వెంటనే గంజాయి మూకలు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత ఫోన్ చేసిన మహిళకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే.. ఇలాంటి పరిస్థితి వస్తే ఎప్పుడైనా సరే వెంటనే సమాచారం ఇవ్వాలని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా అక్కడికి పోలీసులను రప్పించి గంజాయి మూకల అల్లరిని కట్టడి చేయాలని ఆదేశించారు. నిఘాను పెంచి మహిళలకు రక్షణ కల్పించాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.