ఈవీఎంల మీద జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని అందుకే ప్రజా తీర్పు తారు మారు అవుతోందని ఓడిన పార్టీలు గగ్గోలు పెడుతూంటాయి.;

Update: 2026-02-26 17:16 GMT

దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని అందుకే ప్రజా తీర్పు తారు మారు అవుతోందని ఓడిన పార్టీలు గగ్గోలు పెడుతూంటాయి. అయితే గెలిచిన పార్టీలు మాత్రం దీని మీద మాట్లాడవు, ఈ ఈవీఎంల గోల మాత్రం ప్రతీ ఎన్నికల ఫలితాల తరువాత అలా సాగుతూనే ఉంటుంది. చిత్రమేంటి అంటే ఈ ఆరోపణలు చేస్తున్న పార్టీలు గెలిచిన తరువాత మాత్రం మళ్ళీ ఈవీంల ఊసెత్తవు. ఇలా తమాషాగా సాగుతున్న ఈవీఎంల ఆరోపణల విషయంలో లోక్ సత్తా వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే జయ ప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ మీద అలాగే ఈవీఎంల తోనే ఫలితాలు మారిపోతున్నాయన్న దాని మీద తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.

నిరాశావాదం తప్ప :

గెలిచిన వారు ఈవీఎంల మీద ఏమీ మాట్లాడడం లేదని గుర్తు చేసిన ఆయన ఓటమి అందుకున్న వారు మాట్లాడుతున్నారు అంటే అది వారి నిరాశావాదం తప్ప మరేమీ కాదని అన్నారు. ఈవీఎంల విషయంలో గతంలో కొందరు మాజీ ముఖ్యమంత్రులు కోర్టుల దాకా వెళ్ళి మరీ అక్కడ కూడా కేసు కెట్టివేయబడిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. ఎదుటి వారి గెలుపుని ప్రజాస్వామ్యం లక్షణాలను గౌరవించడం అలవాటు లేకనే ఈ రకమైన ధోరణి ప్రబలుతోందని ఆయన అన్నారు.

ఎన్నో అవలక్షణాలు :

అసలు ప్రజలు కానీ మేధావులు కానీ స్వచ్చంద సంస్థలు కానీ పోరాటం చేయాల్సింది అనేక ఇతర అంశాల మీద అని ఆయన అన్నారు. ఈవీఎంల కంటే కూడా అవి ఎంతో ముఖ్యమైనవి అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం మీద పోరాటం చేయాలని అన్నారు. అలాగే గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యులుగా ఉండేలా కచ్చితమైన వ్యవస్థ కోసం ఉద్యమించాలని అన్నారు. గెలిచిన వారు అయిదేళ్ళ పాటు తన నియోజకవర్గాలు తమ సొంతం అని భావిస్తూ యధేచ్చగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ప్రజలు చైతన్యం కావాల్సి ఉందని అన్నారు. అలాగే చట్టబద్ధమైన పాలన ఉండాలని పాలకులు అయినా ప్రజలు అయినా చట్టం ఒకే విధంగా యాక్ట్ చేసేలా చూడాలని అన్నారు.

ఎవరు గెలిస్తే ఏమిటి :

ఈ విషయాల మీద ఉద్యమించి ఎన్నికల సంస్కరణలు తీసుకుని రాకుండా వారిని ఓడించి వీరిని అలాగే వీరిని ఓడించి వారిని తెస్తే ప్రయోజనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు ప్రైవేట్ సంస్థలుగా మార్చుకుని రాజకీయాలను తమ సొంతంగా మార్చుకుంటూ సాగిస్తున్న ఈ ప్రజాస్వామ్యం పోకడల మీద అంతా ఉద్యమించాలని ఆయన కోరారు. అలాగే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఒక సాధారణ కార్యకర్త ఆ పార్టీకి అధ్యక్షుడు అయ్యేలా పార్టీలలో ప్రజాస్వామ్య విలువలు పెరగాలని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్పూర్తిగా ప్రజలకు జవాబు దారీగా ఉండాలని అన్నారు.

పాలన వికేంద్రీకరణ :

అధికారాలు అన్నీ పై స్థాయిలో కేంద్రీకృతం కావడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని జయ ప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. అధికారాలు వికేంద్రీకరణ జరగాలని ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం కావాలని ఆయన కోరారు. అలాగే ప్రజలు ప్రజాస్వామ్యంలో తామే అంతిమ ప్రభువులం అన్నది గుర్తెరగాలని అన్నారు. తాము ఇచ్చిన అధికారంతోనే ఎవరైనా పాలకులుగా ఉంటున్నారు అని తెలుసుకోవాలని అన్నారు. అంతే తమ్మ గెలిచిన వారు ప్రభువులుగా చూస్తూ వారికి గులాములుగా తాము ఉండాలన్న మనస్తత్వాన్ని విడనాడాలని అన్నారు. మొత్తం మీద చూస్తే ఎన్నికల అవలక్షణాల మీద విస్తృత స్థాయిలో అంతా చైతన్యవంతులై పోరాటం చేయాలని జయప్రకాష్ నారాయణ్ పిలుపు ఇచ్చారు.

Tags:    

Similar News