నివాళి: ఎవ‌రీ 'అచ్యుతుడు'.. ఎంద‌కీయ‌న ప్ర‌త్యేకం!

కేర‌ళ సీపీఎం పార్టీ సీనియ‌ర్ దిగ్గ‌జ నేత‌.. నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు రూపం, అప‌ర మేధావిగా మ‌న్న‌న‌లు పొందిన నాయ‌కుడే.. వీఎస్ అచ్యుతానంద‌.;

Update: 2025-07-22 04:17 GMT

పుట్టిన వాడు గిట్ట‌క మాన‌డు.. కానీ.. పుట్టుక‌-గిట్టుక‌ల న‌డుమ ఉన్న జీవితం.. వ్య‌క్తుల‌ను చ‌రిత్ర‌లో నిలిపేలా చేస్తుంది.. అదే చ‌రిత్ర‌లో క‌లిసేలా కూడా చేస్తుంది. కొత్త అధ్యాయాల‌ను సృష్టించేలా చేస్తుంది. ఇలా.. ఓ కొత్త అధ్యాయం సృష్టించిన నాయ‌కుడు. `నిరాడంబ‌ర‌త‌` నడిచి వ‌స్తే..ఎలా ఉంటుందో తానే ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌క‌నే చెప్పిన మాజీముఖ్య‌మంత్రి వీఎస్ అచ్యుతానంద‌. కేర‌ళ రాష్ట్రానికి 2006-11 మ‌ధ్య ఒకే ఒక్క‌సారి అచ్యుతానంద ముఖ్య‌మంత్రి అయ్యారు. అయితేనేం.. కేర‌ళ చ‌రిత్ర‌ను తిర‌గ రాశారు. వ‌న్ డే సీఎంలా వ‌న్ టైమ్ సీఎం అయిన‌.. అచ్యుతానంద‌.. మ‌కిలి ఎక్క‌డున్నా..క‌డిగేయాల‌న్న స్ఫూర్తితో ప‌నిచేశారు. ఇదే ఆయ‌న‌కు ద‌శ‌బ్దాలుగా గుర్తింపును.. చ‌రిత్ర‌లో ఒక అధ్యాయాన్ని లిఖించింది.

ఎవ‌రీయ‌న‌?

కేర‌ళ సీపీఎం పార్టీ సీనియ‌ర్ దిగ్గ‌జ నేత‌.. నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు రూపం, అప‌ర మేధావిగా మ‌న్న‌న‌లు పొందిన నాయ‌కుడే.. వీఎస్ అచ్యుతానంద‌. ఆయ‌న 101వ ఏట సోమ‌వారం క‌న్నుమూశారు. పార్టీల‌కు అతీతంగా.. నాయ‌కులు పార్ధివ దేహాన్ని ద‌ర్శించేందుకు, నివాళుల‌ర్పించేందుకు ఆయ‌న ఇంటికి క్యూ క‌ట్టారంటే.. రాజ‌కీయాల కోసం.. కాదు. ఆయ‌న‌పై ఉన్న అభిమా నం.. ఆయ‌న సంపాయించుకున్న పేరును చూసే. 1923 అక్టోబరు 20న కేరళలో వెనకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు అచ్యుతానందన్‌. లెనిన్‌, స్టాలిన్‌, మావోల స్ఫూర్తితో ఆయ‌న ఎర్ర జెండా ధ‌రించారు. అవిభ‌క్త క‌మ్యూనిస్టు పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు.

ఆ త‌ర్వాత‌.. సీపీఐ-సీపీఎంగా క‌మ్యూనిస్టులు విడిపోయిన‌ప్పుడు.. ఆయ‌న‌సీపీఎం వైపు నిలిచారు. కేర‌ళ‌లో త‌న‌కంటే ప్ర‌త్యేక స్థానం కోసం..ఆయ‌న వెంప‌ర్లాడ‌లేదు. అదే ఎదురేగి ఆయ‌న‌ను ప్ర‌త్యేక స్థానంపైనిలిచేలా చేసింది. దీనికి కార‌ణం.. చేతిలో ఉన్న అధికారాన్ని పీడిత‌, తాడిత, వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం వినియోగించ‌డ‌మే. సొంత లాభం కొంత మానుకుని అన్నారు గుర‌జాడ‌.. కానీ, అచ్యుతానంద‌న్‌కు.. అస‌లు లాభం అంటే.. అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే.. ఆయ‌న సీఎం అయిన‌త‌ర్వాత‌.. కూడా అద్దె ఇంట్లోనే ఉన్నారు. అది రెండుగ‌దుల ఇల్లు. ``ఎవ‌రైనా మీకోసం వ‌స్తే.. ఏం చేస్తారు. ఇక్క‌డ పాయికానా కూడా స‌రిగాలేదు.`` అని అధికారులు ప్ర‌శ్నించిన‌ప్పుడు.. ఆయ‌న చిరున‌వ్వు న‌వ్వారు.

అంతేకాదు..``అస‌లు ఇంటికి ఎందుకు వ‌స్తారు? ఏదైనా తేడా వుంటే క‌దా?. అలాంటివారితో మ‌న‌కు ప‌నేముంది.? అంతా అధికారికంగా ప్ర‌భుత్వానికి ఉన్న కార్యాల‌యాల్లోనే చేద్దాం. అక్క‌డికే ర‌మ్మ‌నండి.`` అని చెప్పిన నిఖార్స‌యిన నాయ‌కుడు అచ్యుతానంద‌న్‌. భూస్వామ్య విధానాల‌పై కాంగ్రెస్ పార్టీ చ‌ట్టం చేసిన‌ప్పుడు పార్టీతో విభేదించి మ‌రీ.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిచ్చారు. అంతేకాదు.. రాష్ట్రంలోనూ.. భూస్వాముల‌పై ఆయ‌న ఉక్కుపాదం మోపారు. సొంత నాయ‌కులే అయినా.. ఆయ‌న వెనుకాడ లేదు. ఉక్కుపాదం మోపారు. ఇదే.. పేద‌లు, బ‌డులకు సీఎంను చేరువ చేసింది. రాజ‌కీయాల్లోనూ నిజ‌మైన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చింది.

ఇప్పుడు త‌ర‌చుగా మ‌న‌కు కొన్నివ్యాఖ్య‌లు వినిపిస్తూ ఉంటాయి. ``నేనే మిమ్మ‌ల్ని గెలిపించాను. నా ఫొటో పెట్టుకునే మీరు గెలిచారు.`` అని!. ఇవి నిజ‌మో కాదో తెలియ‌దు కానీ.. అచ్యుతానంద‌న్ మంచంపై నుంచి కాలు బ‌య‌ట పెట్టే ప‌రిస్థితి లేని స‌మ‌యంలో క‌మ్యూనిస్టులు.. ఆయ‌న ఫొటోల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపించి.. వాటిని ముందు పెట్టి.. అభ్య‌ర్థుల‌కు ఓట్లు అడిగి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదీ.. అచ్యుతానంద‌న్ రాజకీయాల్లో కీల‌క ఘ‌ట్టం. ఇలా.. క‌మ్యూనిస్టులు .. ఒక వ్య‌క్తి ఫొటోను పట్టుకుని ఓట్లు అడిగే సంస్కృతి లేని(ఈ రోజుకు కూడా) స‌మ‌యంలో అచ్యుతుడు.. వారికి ఆద‌రువ‌య్యారంటే అర్ధం చేసుకోవ‌చ్చు. ఆయ‌న లేక‌పోయినా.. ఆయ‌న చేసిన ప‌నులు.. తీసుకున్న నిర్ణ‌యాలు మాత్రం కేర‌ళ‌ను అన్ని రంగాల్లోనూ ప‌రుగులు పెట్టిస్తున్నాయి. ఇదో నివాళి!!.

Tags:    

Similar News