విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. పవన్ ఫస్ట్ రియాక్షన్!
గత మూడేళ్లుగా తీవ్ర వివాదంగా ఉన్న విశాఖ పట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రాజకీయ నాయకులు నేరుగా ఇప్పటి వరకు మాట్లాడింది లేదు.;
గత మూడేళ్లుగా తీవ్ర వివాదంగా ఉన్న విశాఖ పట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రాజకీయ నాయకులు నేరుగా ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. గతంలో వైసీపీ హయాంలో దీనిని ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ.. కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కీలకమైన ముడి ఇనుము గనులను కేటాయిం చకుండా.. ఉద్యోగులను తొలగిస్తూ.. దాదాపు ఫ్యాక్టరీ మూసివేత దిశగా అప్పట్లోనే అడుగులు పడ్డాయి. దీంతో అప్పటి సీఎం జగన్ ప్రధాని మోడీకి నాలుగు పేజీల లేఖ రాసి ఊరుకున్నారు.
ఇక, కూటమి సర్కారు వచ్చాక కూడా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశానికి ఎలాంటి పరిష్కారం చూపలేకపోయారన్న ఆవేదన, ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. ఇదిలావుంటే.. కేంద్రం 11400 కోట్ల రూపాయలను ఆ మధ్య కేటాయించింది. దీంతో ఇక, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాబోదని అనుకున్నారు. కానీ.. దీనిపై కేంద్రం కూడా ఇతమిత్థంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ క్రమంలో ఈ నెల 21నప్రధాని విశాఖ పర్యటనకు వచ్చారు. యోగాంధ్రలో పాల్గొని ఆసనాలు వేశారు. అప్పుడైనా ఆయన విశాఖ ఉక్కుపై క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అప్పుడు కూడా మోడీ స్పందించలేదు. ఇలా.. ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు. రాజమండ్రిలో నిర్వహించిన అఖండ గోదావరి ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
''విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా.. కాపాడాం.'' అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇలా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కీలక పాత్ర పోషించారని అన్నారు. వీరులు పుట్టిన గడ్డ రాజస్థాన్ నుంచి వచ్చిన షెకావత్.. పౌరుషాల గడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితిని అర్ధం చేసు కున్నారని చెప్పారు. అందుకే విశాఖ ఉక్కు సగర్వంగా నిలబడిందన్నారు. దీంతో .. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై క్లారిటీ వచ్చిందని రాజకీయ వర్గాలు, ఉద్యోగులు కూడా భావిస్తున్నారు.