ఇక బీచ్ అందాలను తెగ ఎంజాయ్ చేయొచ్చు.. వైజాగ్ లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు
త్వరలో వైజాగ్‌లో 'హాప్ ఆన్ హాప్ ఆఫ్' (Hop on Hop off) బస్సులురోడ్లపై తిరగనున్నాయి.;
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే విశాఖ ఒక పర్యాటక కేంద్రంగా పేరు గాంచిన సంగతి తెలిసిందే. కొండలు, బీచ్‌లు, నౌకాదళ స్థావరం వంటి వాటితో, సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే పర్యాటకులను ఈ నగరం బాగా ఆకర్షిస్తుంది. అక్కడి ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు అక్కడ పర్యాటక రంగాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం త్వరలో వైజాగ్‌లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై అద్భుత ప్రయాణాలను ఆనందించేందుకు ఖర్చు పెట్టుకుని యూరప్ దాకా వెళ్లనక్కర్లేదు.
'హాప్ ఆన్ హాప్ ఆఫ్' బస్సులు
త్వరలో వైజాగ్‌లో 'హాప్ ఆన్ హాప్ ఆఫ్' (Hop on Hop off) బస్సులురోడ్లపై తిరగనున్నాయి. ఈ బస్సుల ప్రత్యేకత ఏమిటంటే, పర్యాటకులు తాము చూడాలనుకున్న ప్రదేశంలో దిగి, ఎంతసేపు చూసిన తర్వాతైనా, మళ్ళీ అదే రూట్‌లో వచ్చే మరో బస్సు ఎక్కి తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ బస్సులు రుషికొండ, సింహాచలం వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉన్నందున, అక్కడ కూడా ఆగుతాయి. ఆర్‌కే బీచ్ , తొట్లకొండ, రుషికొండ, సింహాచలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఈ బస్సుల ప్రయాణ మార్గంలో భాగమవుతాయి. ఇది సందర్శకులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా వైజాగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో సౌకర్యాలను మెరుగుపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతోంది. ఒక్కసారి వైజాగ్‌కు చేరుకున్న తర్వాత, అక్కడి నుండి భీమిలి, అరకు కూడా వెళ్లవచ్చు. ఇది స్థానికులకు, బయటి నుండి వచ్చే వారికి కూడా ఒక మంచి వీకెండ్ డెస్టినేషన్ గా మారుతుంది. వైజాగ్ ఇప్పటికే తన సహజ సౌందర్యంతో ఆకర్షిస్తుండగా, ఈ కొత్త రవాణా సేవలు నగర పర్యాటకాన్ని మరింత ప్రోత్సహిస్తాయి.