మోడీ బాబు పవన్...యోగా నిద్ర అక్కడ !

విశాఖపట్నం ఒక్క రాత్రికి రాజధానిగా మారిపోయింది. వీవీఐపీలతో విశాఖ సందడి చేస్తోంది.;

Update: 2025-06-20 18:25 GMT

విశాఖపట్నం ఒక్క రాత్రికి రాజధానిగా మారిపోయింది. వీవీఐపీలతో విశాఖ సందడి చేస్తోంది. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో ఒక రాత్రి బస చేస్తున్నారు. ఆయన ఒడిషా టూర్ ని ముగించుకుని విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాకు చెందిన అతిథి గృహంలో ఆయన రాత్రి నిద్ర చేయనున్నారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు అయితే విశాఖలోని కలెక్టరేట్ లో రాత్రి నిద్ర చేయనున్నారు. చంద్రబాబు దాదాపు పదకొండేళ్ళ క్రితం 2014 అక్టోబర్ లో హుదూద్ తుపాను వచ్చినపుడు సహాయ చర్యల కోసం విశాఖ చేరుకుని ఏకంగా వారం రోజుల పాటు కలెక్టరేట్ లోనే బస చేశారు.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆయన విశాఖ కలెక్టరేట్ లో రాత్రి నిద్ర చేయనున్నారు. విశాఖలోని ప్రైవేట్ హొటళ్ళు అన్నీ కూడా వీఐపీలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి కోరుకుంటే ఏదో ఒక ఫైవ్ స్టార్ హొటల్ లో బస చేయవచ్చు. కానీ అలా కాకుండా ఆయన హోస్ట్ గా మారి అందరికీ వసతి ఏర్పాట్లు చూస్తున్నారు. తాను మాత్రం కలెక్టరేట్ లోనే బస చేస్తున్నారు.

ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆయన ఒక ప్రైవేట్ హొటెల్ లో బస చేస్తున్నారు. ఆయన కూడా శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఇక విశాఖకు దాదాపుగా అయిదు నెలల తర్వాత వచ్చిన ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.

మరో వైపు చూస్తే విశాఖలో అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి నలభై దేశాల నుంచి ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు విశాఖలోనే బస చేస్తున్నారు. దాంతో విశాఖ ఏపీకి రాజధాని అన్నట్లుగా కళ కడుతోంది. విశాఖలో ఎటు చూసినా అధికారిక రాజ ముద్రతో వాహనాలు తిరుగుతున్నాయి. ట్రాఫిక్ సైతం విశాఖలో ఉంది. విశాఖలో ప్రపంచ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ రికార్డు సాధించేందుకు విశాఖ ఉత్సాహపడుతోంది.

మరో వైపు చూస్తే కనుక శనివారం ఉదయం ఆరు గంటలకే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి ప్రముఖులు అంతా విశాఖ ఆర్కే బీచ్ కి చేరుకుంటారు. ముందుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమత్రి వేదిక మీద నుంచి ప్రసంగించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం ఏడు గంటలకు అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని ప్రధాని సహా అంతా యోగాసనాలు వేస్తారు. దాదాపుగా నలభై అయిదు నిముషాల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోడీ విశాఖ నుంచి ఢిలీకికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్తారు.

Tags:    

Similar News