విశాఖ బీచ్ కి ఏమైంది...వామ్మో అంటున్న జనం
విశాఖ బీచ్ ని చూస్తే మనసు పులకరిస్తుంది. ఆహ్లాదం కలుగుతుంది. ఈ బీచ్ ని చూసేందుకు ఎంతో మంది విశాఖ వస్తారు.
విశాఖ బీచ్ ని చూస్తే మనసు పులకరిస్తుంది. ఆహ్లాదం కలుగుతుంది. ఈ బీచ్ ని చూసేందుకు ఎంతో మంది విశాఖ వస్తారు. వారిలో పర్యాటకులు ఎక్కువ మంది ఉంటారు. విశాఖ బీచ్ అందాలను చూస్తూ గంటలు నిముషాలుగా గడిపేసేవారు ఎక్కువ. అందమైన బీచ్ నీలి కెరటాలతో ఉరకలెత్తే సాగరం కాస్తా ఇపుడు భయపెడుతోంది. విశాఖ బీచ్ హద్దులు దాటుతోంది. ఒడ్డుని కోత కోస్తోంది. ఇసుక తిన్నెలను సైతం తనలో కలుపుకుంటూ జనాలు కూర్చునేందుకు చోటివ్వకుండా కలవరపెడుతోంది. దాంతో విశాఖ బీచ్ కి ఏమైంది అన్నది అందరికీ పట్టుకుంది. బీచ్ ప్రేమికులు అయితే ప్రళయ రూపం దాల్చడానికి కారణాలు ఏమిటా అని ఆలోచిస్తున్నారు.
అల్లకల్లోలంగానే :
గత రెండు రోజులుగా విశాఖ బీచ్ కల్లోలంగా ఉంది. పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న కెరటాలు ఒడ్డుని తాకుతూ బీభత్సంగా మారుతున్నాయి. తీరాన్ని కోత కోస్తూ దూకుడు చేస్తూ కెరటాలు ముందుకు వస్తున్నాయి. దాంతో విశాఖపట్నం సాగర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. వరసబెట్టి భారీ అలలు ఎగసిపడుతూ నగరంలోని కీలకమైన ఆర్కే బీచ్ రోడ్డు వైపునకు వస్తున్నాయి. వాటికి తోడు అన్నట్లుగా బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇలా ఉప్పొంగుతున్న అలల తాకిడి వల్ల తీర కోత ప్రమాదం పొంచి ఉంది అని అధికారులు చెబుతున్నారు.
హెచ్చరికలతో హడల్ :
బీచ్ వైపు వెళ్ళొద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బీచ్ కి వచ్చే వారు అంతా రాళ్ళ వద్దకు వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారు. కానీ ఇపుడు ఇసుక తిన్నెల మీదకు కూడా కెరటాలు దూసుకుని వస్తున్న నేపధ్యంలో . ప్రజలు పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇక విశాఖ బీచ్ ని చూసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరిస్తున్నారు. అసలు సముద్రంలోకి వెళ్లవద్దు అని సూచిస్తున్నారు. సముద్రపు అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నందున ఎవరూ నీటిలోకి రాళ్ల మీదకు వెళ్లకూడదు అని అధికారులు గట్టి ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్డు లేదా ప్రొమెనేడ్ వద్ద బారికేడ్లకు వెనుక నుంచి మాత్రమే బీచ్ ని చూస్తూ అక్కడి పరిస్థితిని గమనించాలని కోరుతున్నారు. అలాగే అధికారుల సూచనలు పాటించాలని పోలీసులు రక్షణ శాఖ అందించే భద్రతా సలహాలను విధిగా పాటించి జనాలు సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు.
శాశ్వత చర్యలు చేపట్టాలి :
ఇదిలా ఉంటే సముద్రం ప్రతీ పున్నమి అమావాస్యలలో ఆటుపోట్లకు గురి అవుతుంది. అయితే ఇపుడు మామూలు రోజులలో అదే పరిస్థితి ఉంది. దానికి భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణ పరిస్థితులలో వచ్చిన మార్పులే కారణం అని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రస్తుత సీజన్ అంటే ఆగస్టు నుంచి జనవరి వరకూ సముద్రంలోని కరెంట్ అన్నది ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశ వైపునకు వెళ్తుంది. దాంతో కెరటాల కరెంట్ తీవ్రత అధికంగా ఈ సీజన్ లో ఉంటుందని ఓషనోగ్రఫీ సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే వరుసగా వస్తున్న అల్ప పీడనాలు కూడా సముద్ర కెరటాల మీద పడుతోంది అని అంటున్నారు. సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం కూడా కెరటాల ఉదృతికి మరో కారణం అని అంటున్నారు. దాంతోనే విశాఖ తీరం భారీ కోతకు గురి అవుతోంది అని అంటున్నారు. ఇదిల ఉంటే తీరం కొత్త శాశ్వత నివారణకు వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది అని చెబుతున్నారు. 200 కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం, వీఎమ్మార్డీయే 90:10 నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అది కనుక పూర్తి అయితే బీచ్ కెరటాలు హద్దులో అదుపులో ఉంటాయని అంటున్నారు.