రాజుగారి రిటైర్మెంట్.. బీజేపీకి సవాలే.. !
ఈ నేపథ్యానికి తోడు.. ఉత్తర నియోజకవర్గంలో ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు కూడా.. తన నియోజకవర్గంలో కనిపించడం లేదన్నది విష్ణు ఆవేదన.;
విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దాదాపు రిటైర్మెంట్ ప్రకటించేందుకు రెడీ అ య్యారు. అత్యంత సన్నిహిత వర్గాలకు ఆయన దీనిపై సమాచారం కూడా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు పోటీ నుంచి తప్పుకోను న్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణాలు కూడా ఉన్నాయని చెబుతు న్నారు. పార్టీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇదేసమయంలో పార్టీ వ్యవహారాల్లో తనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని.. తనకు కనీసం పిలుపులు కూడా రావడం లేదని విష్ణు ఆవేదనతో ఉన్నారు. ఈ పరిణామాలకు తోడు.. వైసీపీ హయాంలో చేసిన కాంట్రాక్టు పనులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొంత వరకు నిధులు చెల్లించింది. కానీ, ఇంకా రావాల్సిన సొమ్ము ఉంది. దీనిని ఇవ్వాలని విష్ణుకుమార్ రాజు కోరుతున్నారు. కానీ, సర్కారు మాత్రం అది గో ఇదిగో అంటూ.. కాలయాపన చేస్తోందని ఆయనే స్వయంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యానికి తోడు.. ఉత్తర నియోజకవర్గంలో ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు కూడా.. తన నియోజకవర్గంలో కనిపించడం లేదన్నది విష్ణు ఆవేదన. దీంతో ప్రజ లకు కూడా ఏమీ చేయలేక పోతున్నానన్న ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటి కి తాను పోటీ నుంచి తప్పుకొంటానని అంటున్నారు. ఇదే జరిగితే.. ఇంత బలమైన నాయకుడు బీజేపీకి లభిస్తారా? అనేది ప్రశ్న. మరోవైపు.. పార్టీలో అంతర్గత వ్యవహారాలపైనా విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కన్నా లక్ష్మీనారయణ పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు.. తర్వాత.. పురందేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు కూడా విష్ణు ఇదే మాట చెప్పారు. ఇక, ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న మాధవ్ పార్టీకి చీఫ్‌గా ఉన్నారు. దీంతో తనకు ప్రాధాన్యం దక్కుతుందని విష్ణు అనుకున్నారు. కానీ, ఇప్పుడు కూడా ఆయన ఆ అవకాశం లభించడం లేదన్నది ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న వర్గాలు చెబుతున్న మాట. సో.. ఈ పరిణామాలతోనే విష్ణు ఏకంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఇది బెదిరింపా.. లేక నిజమేనా? అనేది చూడాలి.