విశాఖకు మహిళా మేయర్ కంఫర్మ్ ?

విశాఖ మేయర్ పదవికి పోటీ అంతా ఇంతా కాదు, ప్రత్యక్ష ఎన్నికలు అనడంతో టీడీపీలోనే డజన్ల కొద్దీ నాయకులు ఇక సీనియర్ నేతల వారసులు కొత్త వారు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చూస్తే కనుక చాంతాడు అంత లిస్ట్ ఉంది.

Update: 2026-09-10 03:36 GMT

విశాఖ మేయర్ పదవికి పోటీ అంతా ఇంతా కాదు, ప్రత్యక్ష ఎన్నికలు అనడంతో టీడీపీలోనే డజన్ల కొద్దీ నాయకులు ఇక సీనియర్ నేతల వారసులు కొత్త వారు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చూస్తే కనుక చాంతాడు అంత లిస్ట్ ఉంది. జనసేన కూడా విశాఖ మేయర్ మీద ఆశలు పెంచుకుంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీఎంసీ పరిధిలోకి వస్తారు, దాంతో వారి మీద కూడా రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంది. బీజేపీ విషయానికి వస్తే తమకు మేయర్ పీఠాన్ని కేటాయించాలని కోరుతూ జాతీయ స్థాయి నుంచే ఒత్తిడి పెట్టాలని చూస్తోంది అని అంటున్నారు. వైసీపీ వరకూ చూస్తే గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటోంది. మరో వైపు చూస్తే పార్టీలతో సంబంధం లేకుండా తటస్థులు కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఆర్థికంగానూ గట్టిగా ఉండి అంగబలం కూడా ఉన్న వారు సొంతంగా పోటీకి కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్ సీటు అంటేనే హాట్ ఫేవరేట్ గా మారిపోతోంది.

రిజర్వేషన్లు ఎలా :

ఇక ఏపీలో ఉన్న మేయర్ పోస్టులు అన్నీ చూసుకుంటూ జీవీఎంసీలో ఉన్న సామాజిక ఇతర అంశాలను కూడా అంచనా వేసుకుంటూ రిజర్వేషన్ కేటగిరీని నిర్ణయిస్తారు అని అంటున్నారు. 2021లో విశాఖ మేయర్ పదవి జనరల్ అయింది. అయితే దానిని పక్కన పెట్టి బీసీ మహిళకు వైసీపీ అప్పట్లో పట్టం కట్టింది. అంతకు ముందు కూడా జనరల్ గా ఉన్నా కూడా బీసీలకు పీఠం అప్పగించిన ఉదంతాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగాయి. ఇపుడు చూస్తే బీసీ అవుతుందా లేక ఓసీ అవుతుందా అన్న ఉత్కంఠ ఉండనే ఉంది. మరో వైపు చూస్తే వీటికి భిన్నంగా మహిళా రిజర్వేషన్ కాబోతోంది అన్న ప్రచారం కొత్తగా తెర మీదకు వచ్చింది.

ఇదే కారణంగా అంటూ :

విశాఖ మేయర్ మహిళా రిజర్వేషన్ కిందకు ఎలా వెళ్తుంది అంటే దానికి ప్రధాన కారణం విజయవాడ మేయర్ పీఠం గత ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ లోకి వెళ్ళింది ఇపుడు. అక్కడ ఓపెన్ కేటగిరీలోకి పెడతారు అని అంటున్నారు. అలాగే విజయనగరం మేయర్ పీఠం కూడా మహిళగా ఉంది. దానిని ఈసారి మార్చి వేరే రిజర్వేషన్ కేటగిరీగా చేస్తారు అని అంటున్నారు. దాంతో విశాఖ మేయర్ మహిళా రిజర్వేషన్ గా మారుతుందని అంటున్నారు. దాంతో పాట్జుగా రాజకీయంగా వస్తున్న తీవ్ర ఒత్తిళ్లను కూడా పరిగణనలోకి తీసుకుని మహిళ అయితే ఒక పెద్ద ఇబ్బంది తప్పుతుందని పెద్ద ఎత్తున ఆశావహులు సైడ్ అవుతారన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు.

కూటమి నుంచి ఎవరు :

ఒకవేళ విశాఖ మేయర్ మహిళ అయితే కూటమి నుంచి ఎవరు అన్న చర్చ వస్తోంది. ఇక్కడ కూడా టీడీపీకి చెందిన వారి మధ్యనే తీవ్ర పోటీ ఉంది. వైసీపీలో వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా పనిచేసి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన అక్రమాని విజయనిర్మల మేయర్ సీటుని ఆశిస్తున్నారు అని అంటున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె రేసులో ముందున్నారు అని చెబుతున్నారు. అలాగే సీనియర్ నేతలు తమ వారసుల బదులు వారసురాళ్లని తీసుకుని రావాలని చూస్తున్నారు అని కూడా ప్రచారంగా ఉంది. ఇంకో వైపు చూస్తే జనసేన విశాఖ అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ తన సతీమణిని మేయర్ సీటు కోసం పోటీకి దించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

మాజీ ఎంపీతో వైసీపీ :

ఇక వైసీపీ నుంచి చూస్తే అనకాపల్లి నుంచి 2019లో ఎంపీగా గెలిచిన భీశెట్టి సత్యవతిని మేయర్ సీటుకు పోటీ చేయించాలని చూస్తున్నారని అంటున్నారు. ఆమె విద్యాధికురాలిగా డాక్టర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. అలాగే వైసీపీ మహిళా నాయకురాళ్ళ పేర్లు కొన్ని వినిపిస్తూంటే వైసీపీ కి చెందిన సీనియర్ నేతల వారసురాళ్ళు కూడా బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అనూహ్యంగా విశాఖ మేయర్ సీటు మహిళకు కేటాయిస్తే ఎవరూ ఊహించని కొత్త ముఖాలే తెర మీదకు పోటీకి రావచ్చు అని అందులో గెలిచిన వారు సరికొత్త నేతగా మారి విశాఖను పాలిస్తారని అంటున్నారు.

Tags:    

Similar News