కొత్త ఎయిర్ పోర్టు... కొత్త ఈవీ బస్సులు... సూపరెహె !
విశాఖ భోగం అలా ఇలా లేదు మరి. ఆగస్ట్ 1 నుంచి మొత్తం రాత మారుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఓపెన్ అవుతోంది.
విశాఖ భోగం అలా ఇలా లేదు మరి. ఆగస్ట్ 1 నుంచి మొత్తం రాత మారుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఓపెన్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగనుంది. అదే సమయంలో విశాఖ నుంచి భోగాపురం వెళ్ళే ఎయిర్ ట్రావెలర్స్ కోసం ఏపీ ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దాంతో కొత్తగా ఈవీ బస్సులను రంగంలోకి దించుతోంది. ఈ పరిణామాలతో విశాఖకు పండుగ అంతా ఆగస్టు నుంచే అని అంటున్నారు.
విశాఖ నుంచి కనెక్టివిటీ :
భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే విశాఖ నుంచి దాదాపుగా అరవై కిలోమీటర్ల దాకా దూరం ఉంది. అంతే కాదు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు ఎయిర్ ట్రావెలర్స్ సమస్యలకు తగిన పరిష్కారంగా ఎయిర్ పోర్టు ఓపెనింగ్ తోనే ప్రభుత్వం ఇరవై దాకా ఈవీ బస్సులను నడపనుంది. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈవీ బస్సులు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకూ పెద్ద ఎత్తున నడపనున్నారు. ఇవి కేవలం విమానయాన సర్వీసులుగానే నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎయిర్ ట్రావెలర్స్ మాత్రమే ప్రయాణించేందుకు వీలు ఉంటుంది.
రెండు కీలక రూట్లలో :
ఇక ఈ ఇరవై బస్సులలో ఏడు ఈవీ బస్సులు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. మరో పదమూడు బస్సులు ఈ నెలాఖరుకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటిని రెండు ప్రధాన రూట్ల కింద విభజించి చెరి పది బస్సులు వంతున నడపడం ద్వారా మొత్తం ఎయిర్ ట్రావెలర్స్ ఇబ్బందులను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో మొదటి రూట్ కింద గాజువాక నుంచి పది బస్సులు నడుస్తాయి. గాజువాక ఎన్ ఏడీ కొత్త రోడ్ జంక్షన్ మీదుగా భోగాపురం విమానాశ్రయానికి ఆ బస్సులు చేరుకుంటాయి. అలాగే రెండవ రూట్ కింద సింధియా నుంచి స్టార్ట్ అయి రైల్వే స్టేషన్ రుషికొండ బీచ్ రోడ్డు మీదుగా ఎయిర్ పోర్టుకు వెళ్తాయి.
పూర్తి సౌకర్యవంతంగా :
కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈవీ బస్సులు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా పర్యావరణ హితంగా ఉంటాయని చెబుతున్నారు. ఎయిర్ ట్రావెలర్స్ కి తమ లగేజ్ పెట్టుకోవడానికి అవసరం అయిన ప్రత్యేక వసతులు ఈ బస్సులలో ఉంచారు. ఏసీ సదుపాయంతో పాటు లైవ్ లోకేషన్ ట్రాకింగ్ వంటి అత్యాధినిక ఫీచర్లతో ఈవీ బస్సులను రెడీ చేశారు. విమానాల రాక పోకల ఆధారంగా ఈ బస్సులు నగరం నుంచి షెడ్యూల్ చేయబడతాయని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ పోర్టు ఓపెన్ అవడానికి ముందే మౌలిక సదుపాయాలను కల్పించాలన్న ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఈవీ బస్సులను సిద్ధం చేసింది. ఆ విధంగా ఎయిర్ ట్రావెలర్స్ కి ఉన్న సమస్యలను ముందే పరిష్కరించినట్లు అయింది. ఇక ఈవీ బస్సులు విశాఖలో . తాజాగా ప్రవేశపెట్టడంతో విశాఖ వీధులలో ఇవి ప్రయాణిస్తూ సరికొత్త ప్రగతిని నగర వాసులకు ప్రజా రవాణాలో చూపించడం ఖాయమని అంటున్నారు.