విశాఖ నగర కాలుష్యంపై కూటమి ఫోకస్
విశాఖ నగరం దేశంలోని ప్రమాదకర కాలుష్య నగరాల జాబితాలో ఒకటిగా ఉందని తాజాగా నివేదికలు వెల్లడించాయి.;
విశాఖ నగరం దేశంలోని ప్రమాదకర కాలుష్య నగరాల జాబితాలో ఒకటిగా ఉందని తాజాగా నివేదికలు వెల్లడించాయి. వాయు కాలుష్యం విశాఖను పట్టి పీడిస్తోందని కూడా నివేదికలు తేటతెల్లం చేశాయి. విశాఖ ప్రధానంగా పారిశ్రామిక నగరంగా ఉంది. అదే విధంగా విశాఖలో ట్రాఫిక్ ఎక్కువ. దీంతో వాయు కాలుష్యం ప్రతీ ఏటా బాగా పెరిగిపోతోంది అని అంటున్నారు. శీతాకాలం వచ్చిందంటే చాలు అది మరింతగా పెరిగిపోతోంది. దాంతో కాలుష్య నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వెళ్తున్నాయి.
విశాఖ ఇబ్బందులు :
మెగా సిటీ అని బ్యూటి ఫుల్ సిటీ అని విశాఖను అంతా మెచ్చుకుంటారు. అయితే జనాభా కూడా పాతిక నుంచి ముప్పయి లక్షల దాకా పెరిగిపోతోంది. అన్ని పరిశ్రమలు విశాఖ చుట్టే ఏర్పాటు అవుతున్నాయి. దాంతో వాయు కాలుష్యం చాలా అధికంగా ఉందని చెబుతున్నారు. దీని ఫలితంగా అనేక రకాలైన సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు.
కొత్తగా మరిన్ని :
ఇక విశాఖలో కొత్తగా మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖకు ఒక వైపు కొండలు ఉన్నాయి. మరో వైపు సముద్రం ఉంది. వాయు కాలుష్యం ఎటూ పోయేందుకు దారి లేకుండా ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అది తెట్టలాగ పేరుకుని పోయి గాలిలో ఉంటోందని చెబుతున్నారు. అదే విధంగా శీతాకాలంలో అయితే పొగమంచుతో కలసిపోయి మరింత ఇక్కట్లకు గురి చేస్తోంది అని అంటున్నారు. మరిన్ని పరిశ్రమలు కనుక విశాఖ చుట్టు పక్కన వస్తే కనుక కాలుష్యం ఇంకా పీక్స్ లోకి వెళ్తుందని కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.
చంద్రబాబు దృష్టి :
అయితే ఇదే విషయం మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ని ఇదే విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఉన్నతాధికారులు ప్రస్తావించి వివరాలు అడిగారని తెలుస్తోంది. దాంతో ముఖ్యమంత్రికి కలెక్టర్ బదులిస్తూ విశాఖ నగరంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అంతే కాదు, అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. గతానికీ ఇప్పటికీ విశాఖపట్టణంలో కాలుష్యం పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రస్తావించగా జిల్లా కలెక్టర్ దానికి అనుగుణంగా స్పందించారు. కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
యాక్షన్ ప్లాన్ రెడీ :
విశాఖ జిల్లాలో పర్యావరణ విధానాలు, చట్టాలు, నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో తగిన జాగ్రత్తతో వ్యవహరిస్తున్నామని కలెక్టర్ ఈ సమావేశంలో చెప్పారు. కాలుష్య కారకాలను గుర్తించి తగిన విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. తీవ్రత తగ్గే విధంగా ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దాంతో విశాఖ కాలుష్యం మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది అని అంతా అంటున్నారు. పరిశ్రమలు రావడం మంచిదే కానీ కాలుష్యం కూడా లేకుండా చేయాలని జనాలు కోరుతున్నారు.