విశాఖ స్టీల్ ప్లాంట్ పై పొలిటికల్ హీట్.. సడన్ గా ఏం జరిగింది?

ఏపీ రాజకీయాల్లో తాజాగా రేగిన విశాఖ స్టీల్ ప్లాంటుపై రాజకీయ దుమారం తీవ్రరూపం దాల్చుతోంది.;

Update: 2025-11-24 00:30 GMT

ఏపీ రాజకీయాల్లో తాజాగా రేగిన విశాఖ స్టీల్ ప్లాంటుపై రాజకీయ దుమారం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలతో దుమ్ము రేపుతున్నారు. ఇక ఇరుపార్టీలకు మద్దతుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు యూటూబ్ చానళ్లలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. దీంతో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం పెను తుఫాను మాదరిగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోందని అంటున్నారు. ఇరుపక్షాల వాదనలతో కార్మికులు తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. ప్లాంటును పరిరక్షించాల్సిన నేతలు ఇలా దుమ్మెత్తుపోసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని జుట్టు పీక్కుంటున్నారు.

ఇటీవల నిర్వహించిన సీఐఐ సమ్మిట్ లో స్టీల్ ప్లాంటు ఉద్యోగుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. స్టీల్ ప్లాంటును వైట్ ఎలిఫెంటుగా మార్చేశారంటూ సీఎం చేసిన కామెంట్స్ ను అవకాశంగా తీసుకున్న వైసీపీ.. ప్లాంటును ప్రైవేటీకరణకు దారులు వేస్తున్నారని మండిపడుతూ విమర్శలు చేస్తోంది. అంతేకాకుండా తన వాదనను నిజమని నిరూపించుకునేలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో కొందరు యూట్యూబర్లు స్టీల్ ఇష్యూపై ప్రత్యేకంగా వీడియోలు చేస్తూ దుమారం రేపుతున్నారు.

మరోవైపు సీఎం వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కార్మికులు కష్టపడి పనిచేయకపోతే, ఎంత పెద్ద సంస్థ అయినా తెల్ల ఏనుగులా మారిపోతుందన్న ఆలోచనతోనే సీఎం ఉదహరించారని అంటున్నారు. సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ప్లాంట్ రక్షణ కోసం దాదాపు రూ.15 వేల కోట్లు సమకూర్చారని అంటున్నారు. అంతేకాకుండా ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే తటస్థ జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన కొందరు ఈ విషయంలో సీఎం చంద్రబాబును తప్పుపట్టేలా వీడియోలు చేయడంతో వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు.

అయితే చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత టీడీపీ ఈ విషయంలో కాస్త డిఫెన్సులో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాంటును రక్షించాలంటూ కార్మికులు సుమారు 900 రోజులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తిరుగులేని అధికారం చెలాయించినా ప్లాంటు కోసం ఏమీ చేయలేకపోయిందనే విమర్శలు వినిపించేవని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు తన నిరసనలను ఉపసంహరించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడంతో ప్లాంటు రెండో ఫర్నీసు కూడా పనిచేయడం ప్రారంభమైంది.

ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనకబడిన అధికార కూటమి.. వైసీపీ విమర్శల తర్వాత ఎక్కువగా ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు. దీంతో నష్టనివారణ చేయడంపై ఫోకస్ చేసిన కూటమి పెద్దలు వైసీపీని ఎదుర్కోవడంపై మల్లగుల్లాలు పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ద్వారా వైసీపీ చాన్స్ దొరికితే ఎలా వెంటాడుతుందనేది అధికార కూటమి అర్థం చేసుకోవాలని ఆ పార్టీ సానుభూతిపరులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఈ వివాదం హెచ్చరిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News