విరుష్క జోడీకి జాక్‌ పాట్‌.. పెట్టుబడి ఎన్ని రెట్లు పెరిగిందంటే...?

దీంతో ఈ కంపెనీలో కాస్త భారీగానే పెట్టుబడులు పెట్టిన విరుష్క జోడీకి జాక్ పాట్ తగిలిందని అంటున్నారు.

Update: 2024-05-23 14:25 GMT

సెలబ్రిటీలు పెట్టుబడులు పెట్టిన సంస్థలు లిస్టింగ్‌ కు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అంటుంటారు! అలా అని జరగదని కాదు.. ఇప్పుడు జరిగిందే తొలిసారి అనీ కాదు! ఇదంతా ఎందుకంటే... తాజాగా గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యింది. దీంతో ఈ కంపెనీలో కాస్త భారీగానే పెట్టుబడులు పెట్టిన విరుష్క జోడీకి జాక్ పాట్ తగిలిందని అంటున్నారు.

అవును... ఆన్‌ లైన్‌ వేదికగా ఇన్సూరెన్స్‌ ప్రోడక్ట్స్ ని విక్రయించే "గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌" తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యింది. ఇందులో భాగంగా... ఇష్యూ ధర రూ.272 కాగా.. రూ.281 వద్ద 3.35 శాతం ప్రీమియంతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇదే క్రమంలో ఇంట్రాడేలో ఇంకాస్త లాభపడింది. ఇది విరుష్క జోడీకి బిగ్ గుడ్ న్యూస్ అంటున్నారు.

ఎందుకంటే... గతంలో ఈ కంపెనీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు పెట్టుబడులు పెట్టారు. ఇందులో భాగంగా... గో డిజిట్‌ లో ఒక్కో షేరు రూ.75 చొప్పున విరాట్‌ కోహ్లీ 2020లోనే రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టగా.. అనుష్క శర్మ రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. అంటే... ఇద్దరూ కలిపి రెండున్నర కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారన్నమాట.

ఈ క్రమంలో తాజా లిస్టింగ్‌ తర్వాత గో డిజిట్‌ కంపెనీ షేరు విలువ రూ.75 నుంచి రూ.300 దాటిందని చెబుతున్నారు. ఈ లెక్కన వారు పెట్టిన పెట్టుబడికి నాలుగింతల ప్రతిఫలం లభించినట్లయ్యిందని అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ కంపెనీకి విరాట్‌ కోహ్లీనే బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నారు.

కాగా... గతంలో సచిన్‌ టెండుల్కర్ పెట్టుబడి పెట్టిన ఆజాద్‌ ఇంజినీరింగ్ కూడా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలో రూ.114 చొప్పున 4.3 లక్షల షేర్లను సచిన్ కొనుగోలు చేయగా... లిస్టింగ్‌ సమయంలో ఒక్కో షేరు రూ.720 వద్ద ట్రేడయ్యింది. దీంతో సచిన్ సంపద ఒక్కసారిగా ఆరింతలు పెరిగిందని కథనాలొచ్చాయి!

Tags:    

Similar News