విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీగా...అసలేమైంది ?

మొత్తం ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ గిర్రున తిరిగేలా చేయడంతో విజయసాయిరెడ్డి వ్యూహం అద్భుతం అని అంతా అంటారు.

Update: 2024-04-11 18:32 GMT

విజయసాయిరెడ్డి వైసీపీలో ముఖ్య నాయకుడు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే పార్టీకి పిల్లర్ లాంటి వారు. ఆయన 2019 ఎన్నికల ముందు విశాఖలో ఉండేవారు. విశాఖలో ఆయన పార్టీని బాగా పటిష్టం చేశారు. 2014లో వైసీపీకి మొత్తం 34 ఎమ్మెల్యే సీట్లు మాత్రేమ వస్తే 2019 నాటికి ప్రత్యర్ధి టీడీపీకి ఆ తొమ్మిది కూడా రాకుండా చేయగలిగారు. మొత్తం ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ గిర్రున తిరిగేలా చేయడంతో విజయసాయిరెడ్డి వ్యూహం అద్భుతం అని అంతా అంటారు.

ఆయన విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. విశాఖ సిటీ అంటే టీడీపీకి కంచుకోట. 2019లో జగన్ వేవ్ లో సైతం నాలుగు సీట్లు సిటీలో ఉన్నవి వైసీపీ గెలుచుకుంది. అలాంటి చోట 2021లో జరిగిన ఎన్నికల్లో విశాఖ కార్పోరేషన్ ని వైసీపీ పరం చేశారు. వీటి వెనకాల ఆయన ఆలోచనలతో పాటు ఆశలు కూడా ఉన్నాయని ఆనాడే అనుకున్నారు.

విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. నిజంగా ఆయన పోటీ చేసి ఉంటే పెర్ఫెక్ట్ క్యాండిడేట్ గా సెట్ అయ్యేవారు అని అంటారు. అయితే ఆయన విశాఖ నుంచి వెళ్లిపోయారు. అలా ఎందుకు జరిగింది. అసలు ఏమైంది అంటే ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలే చేశారు.

తాను విశాఖ నుంచి వెళ్లాలనుకోలేదు తనను పంపించేసారు అని ఆయన అన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలతో కలసి వైసీపీ నేతలు కుట్ర పన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో నేను ప్రతీ గడపా తిరిగా, ప్రతీ వీధిలోనూ తిరిగాను, యువత కోసం క్రికెట్ టోర్నమెంట్లు పెట్టాను, విశాఖలో జాబ్ మేళాలు ఎన్నో పెట్టాను అని ఆయన వివరించారు.

Read more!

కరోనా టైం లో ఏకంగా విశాఖలో ఒక ఆసుపత్రినే నడిపాను అని ఆయన అన్నారు. ఇంత చేసిన తనను విశాఖ నుంచి తప్పించారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలు ఉన్నారని అన్నారు. విజయసాయిరెడ్డి విశాఖ వదిలేసి రెండేళ్ళు అయింది. ఆయన ఇపుడు నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది ఎన్నికల సమయం. కీలక సమయం. అటువంటి వేళ ఆయన నెల్లూరు ఎంపీగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

సడెన్ గా విశాఖ ప్రస్తావన తెచ్చి అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నాను అని చెప్పడం ఒక విషయం అయితే సొంత పార్టీ నేతలు కుట్ర చేశారు అని చెప్పడం మరో విషయం. ఆ సొంత పార్టె నేతలు ఎవరు అన్న చర్చ వస్తోంది. గతంలో అయితే ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ నేతలు కొందరు టీడీపీ వారితో చేతులు కలిపి విజయసాయిరెడ్డి మీద తీవ్ర విమర్శలు చేయించారు అని ప్రచారం జరిగింది.

ఇపుడు అదే నిజం అంటూ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అంతే కాదు తాను విశాఖలో ఏదో చేశాను అని తన మీద చేసిన ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. తాను ఒక్క తప్పు కూడా చేయలేదని దైవ ప్రమాణం అని ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి విశాఖ మీద తన అభిమానాన్ని తనకు ఉన్న కమిట్ మెంట్ ని చెప్పారు. ఆయన విశాఖ లో ఉంటే వైసీపీ ఇపుడున్నట్లుగా కాకుండా ఇంకా బాగా ఎదిగేది అన్నది చాలా మంది మాట. కానీ ఆయనను తప్పించడం మీద వైసీపీలోనూ చాలా మంది ఇప్పటికీ కలత చెందుతూంటారు.

Tags:    

Similar News