అన్న‌ను మ‌రిపిస్తున్న త‌మ్ముడు 'ఎంపీ' ..!

ఇదే సమయంలో రాజకీయ వివాదాలకు కూడా నాని కేంద్రంగా మారారు అన్న విషయం అప్పట్లో జోరుగా సాగింది.;

Update: 2025-06-27 03:00 GMT

విజయవాడ పార్లమెంటు స్థానంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేసినేని శివనాథ్‌ విజయం దక్కించుకున్నారు. ఇది అప్పటి ఎన్నికల్లో ఒక సంచలన విజయమని చెప్పాలి. వైసీపీ తరఫున అప్పటి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేసిన కేసినేని శ్రీనివాస్ ప‌రాజ‌యం పాలయ్యారు. అయితే, వీరిద్దరూ ఒక తల్లి బిడ్డలే కావడం.. సొంత అన్నదమ్ములే కావడం విశేషం. గడిచిన ఏడాది కాలంలో కేసినేని శివనాద్ ఏ మేరకు పనిచేశారు? ఎట్లా ముందుకు సాగారు? అనేది చూస్తే గడిచిన 10 సంవత్సరాల్లో కేసినేని నాని చేసిన పనులతో పోల్చుకోవాల్సి ఉంటుంది.

ఇదే తాజా సర్వేల్లోనూ వెల్లడైంది. 2014, 2019 ఎన్నికల్లో కేసినేని నాని విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టాటా ట్రస్ట్ ద్వారా అనేక పనులు చేయించడం, విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం గొల్లపూడిలోను రహదారుల విస్తరణ వంటివి చేపట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు జలజీవన్ మిషను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపీ నిధుల ద్వారా కూడా ఆయన మెరుగైన సౌకర్యాలను కల్పించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కేసినేని నాని అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది.

ఇదే సమయంలో రాజకీయ వివాదాలకు కూడా నాని కేంద్రంగా మారారు అన్న విషయం అప్పట్లో జోరుగా సాగింది. వీటితో పోల్చి చూసినప్పుడు నాని సోదరుడిగా `తమ్ముడు ఎంపీ` ఏ మేరకు ప్రజల ను చేరువ అవుతున్నారు? అనేది ముఖ్యమైన విషయం. ఈ క్రమంలో అన్నను మరిపించేలాగా తమ్ముడు వ్యవహరిస్తున్నారనేది పరిశీలకులు చెబుతున్న మాట. ప్రభుత్వానికి చేరువుగా ఉంటూ సీఎం చంద్రబాబు కనసన్న‌ల్లో కార్యక్రమాలు చేపడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే దిశగా ఎంపీ శివనాద్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర‌ కార్యక్రమంలో ఆయన విజయవాడ భవానిపురంలోని కృష్ణా నది వద్ద ఫ్లోటింగ్ యోగ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు దక్కించారు. తద్వారా సీఎం చంద్రబాబు కనుసన్న‌ల్లో పడ్డారు. ఇక మైలవరం, తిరువూరు వంటి కీలక నియోజకవర్గం లోని గ్రామీణ ప్రాంతాల్లో గతంలో తన అన్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి వాటిని పూర్తి చేశారు.

త‌ద్వారా గ్రామీణుల మనసు దోచుకున్నారు అనే చెప్పాలి. ఇక అంతర్గత రాజకీయాలు, పార్టీలో వ్యక్తిగత విషయాలకు వస్తే గతంలో ఉన్నంత తేడా అయితే ఇప్పుడు కనిపించడం లేదు. విభేదాలు అయితే ఉన్నాయి. కానీ మరీ విడదీసి గ్రూపు రాజకీయాలు చేసేలాగా ప్రస్తుతం కనిపించడం లేదు. అందర్నీ కలుపుకొని పోవడం.. ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్లడం.. ఏ కార్యక్రమానికైనా హాజరు కావడం వంటివి ప్రధానంగా శివనాధ్‌కు మంచి మార్కులు పడేలా చేశాయి. ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను ఆయన మంచిగానే వ్యవహరిస్తున్నారు.

ఇద్దరు కేంద్ర మంత్రులతోనూ కలుపుకొని పోవడం, రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో చర్చించడం, తన సలహాలు సూచనలు ఇవ్వడం వంటివి చేయడం ద్వారా శివనాద్ మంచి మార్కులే వేసుకున్నారని చెప్పాలి. ప్రస్తుతానికైతే అన్నను మరిపించే ప్రయత్నంలో `తమ్ముడు ఎంపీ` తొలి ఏడాది బాగానే సక్సెస్ అయ్యారని అంటున్నారు` మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News