మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి.. అసలేంటి కథ?

రాజకీయ రణక్షేత్రంలో పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన చాణక్యుడు.. ఇప్పుడు తన రూటు మార్చారు.;

Update: 2026-04-11 09:44 GMT

రాజకీయ రణక్షేత్రంలో పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన చాణక్యుడు.. ఇప్పుడు తన రూటు మార్చారు. మైకు పట్టుకుని విమర్శలు చేయడం కాదు... ఏకంగా మైకులనే శాసించే మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. 'నమస్కారం... వార్తలు చదువుతోంది మీ విజయసాయిరెడ్డి' అని ఆయన నేరుగా అనకపోయినా.. తెలుగు మీడియా తెరపై సరికొత్త సంచలనానికి ఆయన తెరలేపారు. రాజకీయాలకు 'గుడ్ బై' చెప్పిన ఈ మాజీ రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు కలం పట్టి సత్తా చాటుతారా? లేక తన మీడియా సంస్థతో రాజకీయ సమీకరణాలను తిరగరాస్తారా? ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని నిలబడుతారా? మీడియాను నిలబెడుతాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఇప్పుడు ఇదే ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. రాజకీయాలకు అధికారికంగా స్వస్తి పలికిన అనంతరం.. ఆయన ఇప్పుడు మీడియా రంగంపై దృష్టి సారించడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. తాను త్వరలోనే ఒక అత్యాధునిక డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు.. అది క్రమంగా పూర్తిస్థాయి శాటిలైట్ న్యూస్ ఛానల్‌గా రూపాంతరం చెందుతుందని ఆయన అధికారికంగా ప్రకటించారు.

డిజిటల్ ఫస్ట్.. శాటిలైట్ నెక్స్ట్.. వ్యూహాత్మక అడుగులు

విజయసాయిరెడ్డి తన మీడియా ప్రస్థానాన్ని వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. నేటి కాలంలో డిజిటల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో తొలుత డిజిటల్ వేదికగా వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ స్థిరపడిన తర్వాత దాన్ని విస్తరించి ఒక సమగ్రమైన తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను తీసుకురావడమే తన అంతిమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ సంస్థ కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ వార్తలను అందిస్తూ జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించబోతోంది.

నిష్పక్షపాత జర్నలిజమే ధ్యేయం

సాధారణంగా రాజకీయ నాయకులు స్థాపించే మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తాయనే విమర్శ ఉంటుంది. అయితే విజయసాయిరెడ్డి దీనిపై స్పష్టతనిచ్చారు. తన మీడియా సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు , సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించకుండా సమతుల్యమైన వాస్తవాధారిత జర్నలిజాన్ని ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పాత ఆలోచన.. కొత్త ఆచరణ

వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి మీడియా రంగంపై ఆసక్తి చూపేవారు. అప్పట్లో కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల వైఖరిని తప్పుబడుతూ తానే స్వయంగా ఒక మీడియాను స్థాపించి చూపిస్తానని సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయ బాధ్యతల వల్ల అప్పట్లో అది సాధ్యపడలేదు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాక తన పాత ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. "మీడియా రంగం నిర్వహణ చాలా క్లిష్టమైనది.. కానీ ప్రజా సమస్యలను వినిపించే బలమైన వేదిక అవసరమని నేను నమ్ముతున్నాను." అని విజయసాయిరెడ్డి ప్రకటించారు.

మార్కెట్‌లో అంచనాలు.. సవాళ్లు

ప్రస్తుతం తెలుగు మీడియా రంగంలో విపరీతమైన పోటీ ఉంది. ఇప్పటికే అనేక స్థిరపడిన ఛానళ్లు ఉండగా కొత్తగా వచ్చి తన ముద్ర వేయడం విజయసాయిరెడ్డికి ఒక పెద్ద సవాలు... అంత ఈజీ కూడా కాదు.. భారీ పెట్టుబడులతో పాటు విశ్వసనీయత కలిగిన జర్నలిస్టులను ఎంచుకోవడం అత్యవసరం. ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిగా వార్తల్లో నిష్పక్షపాతాన్ని ఎలా కాపాడతారనేది ప్రేక్షకులు గమనించే అంశం.

రాజకీయ చాణక్యుడిగా పేరున్న విజయసాయిరెడ్డి మీడియా రంగంలో తన 'సెకండ్ ఇన్నింగ్స్'ను ఎలా నడిపిస్తారో వేచి చూడాలి. ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైతే తెలుగు మీడియా ముఖచిత్రంలో మరో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News