తమిళ సంచలనం : చేతులు కలపనున్న స్టాలిన్ పళనిస్వామి ?
ఇదిలా ఉంటే తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఒక వేదికగా ఏర్పడాలని మాజీ సీఎం పళని స్వామి అంటున్నారు.
తమిళనాడులో రెండు సంప్రదాయ ద్రవిడ పార్టీలను ఓడించి కొత్త పార్టీగా టీవీకేను అధికారంలోకి తెచ్చిన ఘనత దళపతి విజయ్ దే. గత ఆరు దశాబ్దాలుగా చేతులు మారుతూ వస్తున్న అధికారాన్ని అవకాశాన్ని డీఎంకే అన్నా డీఎంకేలకు దక్కనీయకుండా విజయ్ చేశారు. ప్రజలకు సరికొత్త ఆల్టర్నేషన్ గా తన పార్టీని చూపించారు. ఇక విజయ్ పార్టీకి సీట్లు కొన్ని తగ్గినా కాంగ్రెస్ ఇతర మిత్రులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇపుడు కొత్త కూటమిగా పేరు కూడా పెట్టారు, దీంతో దీర్ఘకాలంలో ఈ కూటమి ద్వారా తమిళనాడులో బలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని అధికారాన్ని పటిష్టం చేసుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ చూస్తున్నారు. విజయ్ ఈ విధంగా రాజకీయ ఎత్తుగడలకు దిగడంతో సంప్రదాయ రాజకీయ శక్తులు ఇప్పటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే అన్నా డీఎంకేకి పెను సవాల్ గా మారుతోంది.
త్రిముఖ పోరులో హిట్ :
ఇక తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం 2026 మే నెలలో జరిగిన ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయింది. మూడు పార్టీల వ్యవస్థగా అది పరిణమించింది. అంటే ఇక మీదట జరిగే ఏ ఎన్నిక అయినా త్రిముఖ పోరు అన్న మాట. త్రిముఖ పోరు అంటే అధికారంలో ఉన్న పార్టీలకు గెలుపు అవకాశాలు రెట్టింపు అవుతాయి. అదే విపక్షంలో ఉన్న పార్టీలకు ఓట్లు చీలి పీఠానికి ఎప్పటికీ దూరంగానే ఉండిపోతాయి. రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న డీఎంకే అధినేత స్టాలిన్ అలాగే అన్నా డీఎంకేకి చెందిన అధినాయకుడు పళని స్వామికి తెలియనిది కాదు, దాంతో చిరకాల ప్రత్యర్ధులు ఇద్దరూ ఇపుడు దీర్ఘ కాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాంతో గత విభేదాలను మరచి ఒక వేదిక మీదకు వచ్చే అవకాశాలను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.
డీఎంకేకి ఆహ్వానం :
ఇదిలా ఉంటే తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఒక వేదికగా ఏర్పడాలని మాజీ సీఎం పళని స్వామి అంటున్నారు. ప్రజల కోసం అవసరం అయితే డీఎంకే అధినేత స్టాలిన్ తో చేతులు కలిపేందుకు కూడా సిద్ధమని పళని స్వామి ప్రకటించడం ఇపుడు రాజకీయంగా కాక పుట్టిస్తోంది. రెండు భిన్న పార్టీలు చిరకాల వైరం ఉన్న పార్టీలు ఒక్కటి అవుతామని చెప్పడం చూస్తూంటే విజయ్ ప్రభావం తమిళనాడులో ఎంతగా ఉందో అర్ధం అవుతోంది అని అంటున్నారు. ప్రజా సమస్యలు అని బయటకు చెబుతున్నా రాజకీయ అస్తిత్వం కోసమే ఈ విధంగా చేతులు కలపాలని కోరుకుంటున్నారు అని విశ్లేషణలు ఉన్నాయి. టీవీ కేకు వ్యతిరేకంగా తాము ఏర్పాటు చేయబోయే కూటమిలోకి డీఎంకే వస్తే స్వాగతిస్తామని పళని స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో పోరు :
ఇక రాష్ట్ర శాసనసభలో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ తరువాత ప్లేస్ లో పళనిస్వామి నాయకత్వంలో అన్నా డీఎంకే ఉంది. అధికార టీవీకే నిరంతరం ద్రవిడ పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. డీఎంకే ప్రభుత్వం అవినీతి మీద కూడా ముఖ్యమంత్రి విజయ్ లేటెస్ట్ గా చేసిన విమర్శలు సభను ఒక్కసారిగా వేడెక్కించాయి. దాంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభలోనే నిరసన తెలిపారు. ఇలా ఢీ అంటే ఢీగా సాగుతున్న తమిళ రాజకీయంలో విజయ్ ని పక్కన పెట్టేందుకు స్టాలిన్ పళని స్వామి చేతులు కలుపుతారా అన్నదే చర్చగా ఉంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నది ఉంది. ఇపుడు రెండు ద్రవిడ పార్టీల అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతున్న నేపధ్యంలో ఉమ్మడిగా ముందుకు వచ్చి విజయ్ ని రాజకీయంగా కట్టడి చేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.