తమిళనాట విజయ్ కు కలిసొస్తున్న కాలం.. మరో 3 పార్టీల మద్దతు
దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ ఒక బలమైన కూటమిని సిద్ధం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.;
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ రాష్ట్ర రాజకీయాల్లో 'కింగ్ మేకర్' స్థాయి నుంచి 'కింగ్' స్థానానికి చేరుకునేందుకు అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ ఒక బలమైన కూటమిని సిద్ధం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
చేతులు కలిపిన వామపక్షాలు, దళిత పార్టీలు
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీసీకే (విదుతలై చిరుతైగల్ కట్చి), సీపీఐ , సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉన్న ఈ పార్టీలు, విజయ్ నేతృత్వంలోని సెక్యులర్ ఫ్రంట్‌లో చేరడం ద్వారా తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు బాసటగా నిలవగా ఇప్పుడు వామపక్షాలు, సామాజిక న్యాయ పోరాట పార్టీల చేరికతో విజయ్ బలం అమాంతం పెరిగింది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. టీవీకే, దాని మిత్రపక్షాల మొత్తం బలం 118కి చేరినట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్‌ను అందుకోవడానికి ఇది అత్యంత కీలకమైన సంఖ్య.
నేడే మీడియా సమావేశం.. గవర్నర్‌తో భేటీకి సిద్ధం
తాజా సమాచారం ప్రకారం.. వీసీకే అధినేత తిరుమావళవన్, వామపక్ష నేతలు కాసేపట్లో సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో విజయ్ ప్రభుత్వానికి తాము ఇచ్చే మద్దతును అధికారికంగా ప్రకటించనున్నారు. కేవలం అధికారం కోసం కాకుండా బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే వ్యూహాలకు చెక్ పెడుతూ ఒక పటిష్టమైన "సెక్యులర్ - సోషల్ జస్టిస్" వేదికను నిర్మించడమే లక్ష్యమని వారు పేర్కొంటున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ సాయంత్రమే విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కలవబోతుండటం రాష్ట్రంలో ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చింది. కాంగ్రెస్, వీసీకే , సీపీఐ , సీపీఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను విజయ్ గవర్నర్‌కు సమర్పించనున్నారు. తమకు కావాల్సిన 118 మంది సభ్యుల మద్దతు ఉందని.. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ హవా.. ద్రవిడ పార్టీల గుండెల్లో రైళ్లు
తమిళనాడు అంటేనే సినిమా గ్లామర్ , రాజకీయ పవర్ కలగలిసిన రాష్ట్రం. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ కలిగిన నాయకుడిగా విజయ్ ఎదిగారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి వర్గాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ఓట్లుగా మారుతుండటంతో పాత తరం పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి.
డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పొత్తుల చర్చలు సాగుతున్నాయన్న వార్తల మధ్య, విజయ్ అత్యంత వేగంగా పావులు కదిపి మిత్రపక్షాలను తనవైపు తిప్పుకోవడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన అనే నినాదాలతో విజయ్ ముందుకు వెళ్తుండటం ప్రజలను ఆకర్షిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం?
రాబోయే కొద్ది గంటలు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ గవర్నర్ విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తే, ఒక సినీ స్టార్ నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన అరుదైన ఘట్టం మళ్లీ ఆవిష్కృతం కానుంది. "దళపతి" నుంచి "ముఖ్యమంత్రి"గా విజయ్ ప్రస్థానం ఎలా ఉండబోతుందోనని యావత్ భారతదేశం ఆసక్తిగా గమనిస్తోంది. ఒకవేళ ఈ సమీకరణాలు ఫలిస్తే, తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక భారీ భూకంపం అనడంలో సందేహం లేదు.