విజయ్ పార్టీపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్.. సంచలన విషయం!
తమిళనాడులో విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోయినా.. ప్రధాన ప్రతిపక్షంగా చక్రం తిప్పుతుందని పేర్కొనడం విశేషం.;
తమిళనాడులో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ పార్టీ టీవీకేకు సంబంధించి తాజాగా గురువారం సాయంత్రం మరో కీలక ఎగ్జిట్ పోల్ సర్వే వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా మంచి ఫాంలో ఉన్న `టుడేస్ చాణక్య` సర్వే సంస్థ.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై తాము చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేసింది. దీనిలో విజయ్ పార్టీ విషయంలో కీలక రిపోర్టు ఇచ్చింది.
ప్రధాన ప్రతిపక్షంగా..
విజయ్ పార్టీ టీవీకేకు వాస్తవంగా.. బుధవారం సాయంత్రం విడుదలైన పలు సర్వే రిపోర్టులు.. పెద్దగా ప్రభావం లేదని తేల్చేశాయి. అంతేకాదు.. 10-25 సీట్లు వస్తే `మా గొప్ప` కూడా కొన్ని సర్వేలు వ్యాఖ్యానించా యి. అంతేకాదు.. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు విజయ్ పార్టీ చక్కగా కలిసి వచ్చిందని కూడా పేర్కొన్నాయి. కానీ.. వీటికి భిన్నంగా.. టుడేస్ చాణక్య తన సర్వే రిపోర్టును వెల్లడించింది.
తమిళనాడులో విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోయినా.. ప్రధాన ప్రతిపక్షంగా చక్రం తిప్పుతుందని పేర్కొనడం విశేషం. ముఖ్యంగా మాజీ సీఎం దివంగత జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకును విజయ్ తనవైపు తిప్పుకొన్నట్టు స్పష్టం చేసింది. దీంతో అన్నాడీఎంకే మూడో స్థానానికి పడిపోతోందని.. ఈ ప్లేస్‌ను విజయ్ ఆక్రమిస్తున్నారని పేర్కొంది. అయితే.. అధికారంలోకి వచ్చేంత స్థాయిలో విజయ్ పార్టీకి సీట్లు దక్కడం కష్టమని స్పష్టం చేసింది. అయితే.. పోటీ మాత్రం నెక్ టు నెక్ అన్నట్టుగా ఉంటుందని అభిప్రాయపడింది.
టుడేస్ చాణక్య సర్వే రిజల్ట్ ఇదీ..
మొత్తం స్థానాలు: 234
డీఎంకే కూటమికి : 125(11 అటు ఇటుగా రావొచ్చు)
టీవీకే విజయ్ పార్టీ: 63 స్థానాలు (10 అటు ఇటుగా వచ్చే అవకాశం)
అన్నాడీఎంకే కూటమి: 45 (11 సీట్లు అటు ఇటుగా వచ్చే అవకాశం.)
ఓట్ల షేర్ ఇలా..
డీఎంకే కూటమి : 39 శాతం
విజయ్ పార్టీ: 30 శాతం.
అన్నాడీఎంకే: 27 శాతం