ఆ ఏడు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవని టీవీకే.. కారణం ఇదే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి కొన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు.;
రాజకీయాల్లో ఏకపక్ష విజయాలు ఎప్పుడూ సంపూర్ణంగా ఉండవు. ఒకవైపు అఖండ మెజారిటీతో అధికారం దక్కిందన్న ఉత్సాహం కనిపిస్తున్నా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకుండా పరాభవం పాలై నాయకుడిని ఆత్మరక్షణలో పడేస్తుంది. తమిళనాడు అంతటా ‘దళపతి’ మేనియా విసృతంగా విస్తరించింది. కానీ కొన్ని కోటలు ఆ ప్రభంజనానికి లొంగలేదు. రాష్ట్ర మంతా తన గళం వినిపిస్తుందని ఆశించిన విజయ్‌కి కొన్ని జిల్లాలు ఊహించని షాక్ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన మార్పు గాలి కొన్నిచోట్ల ఎందుకు ఆగిపోయింది? మద్దతు ఉందని భావించిన వర్గాలు ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వెనకడుగు వేశాయి? అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న.
ఏడు జిల్లాల్లో శూన్యం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి కొన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. పైగా పెద్దగా ఓట్లు కూడా పోలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆదరణ దక్కినప్పటికీ, ఏడు జిల్లాల్లో ఒక్క సీటు కూడా ఖాతాలో వేసుకోలేకపోయింది. కన్యాకుమారి, మైలాడుదురై, తిరువారూర్, నాగై, నీలగిరి, తెన్కాశి మరియు అరియలూర్ జిల్లాల్లో టీవీకే ఘోర పరాజయాన్ని చవిచూసింది. మెజారిటీ మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లినప్పటికీ, ఈ ఏడు జిల్లాల్లో బోణీ కొట్టలేకపోవడం విజయ్ వ్యూహకర్తలను ఆలోచనలో పడేసింది.
ప్రచారం వేరు.. ఫలితం వేరు
ముఖ్యంగా నాగై, మైలాడుదురై జిల్లాలపై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారులు ఎన్నికలకు ముందే విజయ్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సినీ గ్లామర్‌తో పాటు వారి సమస్యలపై పోరాడుతారనే నమ్మకంతో మత్స్యకార వర్గాలు విజయ్ వైపు మొగ్గు చూపుతాయని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే, పోలింగ్ ముగిసి ఫలితాలు వచ్చేసరికి ఆ సానుకూలత ఓట్లుగా మారడంలో విఫలమైంది. సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చడంలో టీవీకే విఫలమవ్వడం, క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం ఈ పరాజయానికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డీఎంకే, ఏఐడీఎంకేలకు తప్పని పరాభవం
కేవలం కొత్త పార్టీ అయిన టీవీకే మాత్రమే కాదు.., దశాబ్దాల చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలకు కూడా కొన్ని జిల్లాల్లో చుక్కెదురైంది. అధికారంలో ఉన్న డీఎంకే ఏకంగా ఏడు జిల్లాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐడీఎంకే పరిస్థితి మరీ దారుణం. ఆ పార్టీ తొమ్మిది జిల్లాల్లో ఖాతా తెరవలేదు. ఈ పరిణామం తమిళనాడులో ప్రాంతాల వారీగా ఓటర్ల మొగ్గు ఎంత భిన్నంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఒక ప్రాంతంలో ప్రభంజనం సృష్టించిన పార్టీ, మరో ప్రాంతంలో నామమాత్రపు ఉనికికి కూడా పరిమితం కావడం ఈ ఎన్నికల విశేషం.
క్షేత్రస్థాయి బలంపై పునరాలోచన
విజయ్ పార్టీ 108 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, పరాజయం పాలైన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. నీలగిరి వంటి గిరిజన ప్రాంతాలు, కన్యాకుమారి వంటి విభిన్న సామాజిక సమీకరణాలు ఉన్న చోట్ల విజయ్ మేజిక్ ఎందుకు పనిచేయలేదనే దానిపై అంతర్గత సమీక్షలు మొదలయ్యాయి. రాబోయే ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారానే, వచ్చే ఎన్నికల నాటికి అక్కడ పట్టు సాధించడం సాధ్యమవుతుంది.
విజయ్ సాధించిన ఈ ‘విజయం’ వెనుక కొన్ని ప్రాంతీయ వైఫల్యాలు పాఠాలుగా మిగిలాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా ఎలా అక్కున చేర్చుకుంటారో చూడాలి.