అన్నా డీఎంకే ఖతం...టీవీకే ప్లాన్ ?
తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలను తట్టుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన టీవీకే అధినేత విజయ్ తన ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేల మద్దతును సమకూర్చుకోవడానికి అన్నా డీఎంకే నుంచి ఎక్కువగా వలసలను ప్రోత్సహించారు.
తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలను తట్టుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన టీవీకే అధినేత విజయ్ తన ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేల మద్దతును సమకూర్చుకోవడానికి అన్నా డీఎంకే నుంచి ఎక్కువగా వలసలను ప్రోత్సహించారు. ఇపుడు వారి అసెంబ్లీ నియోజకవర్గాలో ఉప ఎన్నికలు వచ్చాయి. టీవీకే పార్టీ జెండాతో గుర్తుతో వారు పోటీకి దిగుతున్నారు. ఈ సందర్భంగా టీవీకే ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసింది. అన్నా డీఎంకే మీదుగా డీఎంకేను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ తన ప్రసంగాలు చేస్తున్నారు. అన్నా డీఎంకే డీఎంకేకి బీ టీం అని ప్రతీ ప్రచార సభలోనూ విమర్శలు చేస్తున్నారు.
తీవ్ర స్థాయిలోనే :
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం అతి పెద్ద సమరాన్ని తలపిస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం మధురాంతకం (ఎస్సీ) ధారాపురం (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు సీట్లూ అన్నా డీఎంకేకు చెందినవి. గట్టిగా పట్టు ఉన్నవి. ఈ సీట్లలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరగతం కుమారవేల్ (మధురాంతకం), పి. సత్యభామ (ధారాపురం) తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. నాలుగు నెలల క్రితం అన్నా డీఎంకే టికెట్ మీద పోటీ చేసిన ఈ నాయకులు ఇపుడు టీవీకే గుర్తు తో పోటీ పడుతున్నారు. ఈ ఫిరాయింపుల మీద అన్నా డీఎంకే మండిపడుతూ జనంలో సానుభూతి కోసం చూస్తోంది. అదే సమయంలో విజయ్ అయితే అన్నా డీఎంకే డీఎంకే అనుబంధ సంస్థ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ రచ్చగా మారుతోంది.
ఎంజీఆర్ జయలలిత అంటూ :
విజయ్ నోటి వెంట అన్నా డీఎంకే మహా నేతలు ఎంజీఆర్ జయలలిత పేర్లు రావడం కూడా వ్యూహాత్మకంగానే అని అంటున్నారు. అన్నా డీఎంకేను నిలబెట్టిన ఆ మహా నేతలకు ద్రోహం చేస్తూ ప్రస్తుతం అన్నా డీఎంకే నేతలు డీఎంకేతో చెట్టాపట్టాల్ వేస్తున్నారు అని తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. దివంగత నేతల ప్రస్తావన ద్వారా ఆయన అన్నా డీఎంకే క్యాడర్ ని తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అన్నా డీఎంకే అస్తిత్వం మీదనే దెబ్బ కొడుతున్నారని విశ్లేషణలు ఉన్నాయి.
డీఎంకే కు మేమే :
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకేకు అసలైన ఆల్టర్నేషన్ టీవీకే మాత్రమే అని విజయ్ గట్టిగానే ప్రతీ సభలోనూ చెబుతున్నారు. అవినీతి అక్రమాల విషయంలో డీఎంకే అన్నా డీఎంకేలు రెండు ఒకటేనన్న విషయాన్ని కూడా తన ప్రసంగాల ద్వారా విజయ్ ప్రజల్లోకి బలంగానే తీసుకెళ్తున్నారు. ముందు అన్నా డీఎంకే అస్తిత్వం మీద దెబ్బ కొడితే తమిళనాడులో రెండు పార్టీల వ్యవస్థ వస్తుందని అపుడు డీఎంకేని ఎదుర్కోవడం మరింత సులువు అని విజయ్ భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే డీఎంకేకు బీ టీం అన్న టీవీకే విమర్శల పట్ల అన్నా డీఎంకే నేత పళనిస్వామి కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విజయ్‌పై విమర్శలు చేస్తూ సినిమా డైలాగులు రాజకీయాల్లో పని చేయవంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద అన్నా డీఎంకే ఓట్ బ్యాంక్ మీద టీవీకే పెట్టిన గురి ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది ఈ ఉప ఎన్నికల ఫలితాలతో తేలుతుందని అంటున్నారు.